రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు బిట్స్ పిలాని డిఐఏటి కీలక ఒప్పందాలు
హైదరాబాద్‌లో బిట్స్ పిలానీ, డిఐఎటి ‘డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ డే 2026’
జవహర్ నగర్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతను వేగవంతం చేయడమే లక్ష్యంగా బిట్స్ పిలానీ జవహర్ నగర్, హైదరాబాద్ క్యాంపస్, డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ డిఐఎటి-పుణె సంయుక్తంగా "డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ డే 2026(Defence and Aerospace Industry Day 2026)"ను మంగళవారం నిర్వహించాయి. "మిషన్-రెడీ ఆవిష్కరణల కోసం అకాడమియా-పరిశ్రమల భాగస్వామ్యం" అనే నినాదంతో సాగిన ఈ సదస్సుకు డిఆర్‌డిఓ, మిధాని, బిఇఎల్, హెచ్‌ఎఎల్ వంటి సంస్థలు, 45 ప్రముఖ కంపెనీల నుంచి సుమారు 125 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
పరిశోధన, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, సంయుక్త వాణిజ్యీకరణ కోసం 20 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 48 స్వదేశీ సాంకేతికతల ప్రదర్శన: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ ఐ ), అడ్వాన్స్డ్ మెటీరియల్స్, ఆటోనోమౌస్ సిస్టమ్స్, సెన్సార్ల విభాగాల్లో 48 నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు.
కీలక సందేశాలు: డిఐఎటి వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి.హెచ్.వి.ఎస్. నారాయణమూర్తి, బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. రామ్‌గోపాల్ రావు, డిఆర్‌డిఓ డిజి డాక్టర్ జగన్నాథ్ నాయక్, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ చైర్మన్ రాజేందర్ సింగ్ భాటియా ప్రసంగిస్తూ—ప్రయోగశాల పరిశోధనలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు పరిశ్రమలు, విద్యాసంస్థలు ప్రారంభ దశ నుంచే కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్య నిర్ణయాలు:
డిఆర్‌డిఓ మాజీ ఛైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి, ప్రొఫెసర్ వి. రామ్‌గోపాల్ రావు నేతృత్వంలో జరిగిన ఓపెన్ హౌస్ సెషన్‌లో—ఒప్పంద ప్రాజెక్టులను వేగంగా ప్రారంభించడం, క్యాంపస్‌లోనే సంయుక్త పరిశోధన కేంద్రాలు (జాయింట్ రీసెర్చ్ లాబ్స్ ) ఏర్పాటు చేయడం మరియు సులభతర మేధో సంపత్తి (ఐపీ ) విధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యంగా రక్షణ రంగాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో ఈ సదస్సు ముగిసింది.