కలెక్టర్ హామీతో మళ్లీ ప్రారంభం
ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah) హామీతో తిరిగి ప్రారంభమైంది. శుక్రవారం వైభవంగా ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర(Ganesh Shobha Yatra) అర్ధరాత్రి దాటే వరకు సాఫీగా సాగింది. గణేష్ మండల్ నిర్వాహకులు, యువకులు బ్యాండ్ మేళాలు, డీజే సౌండ్ లకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా శోభాయాత్రలు పాల్గొన్నారు.
అయితే పోలీసులు శోభాయాత్రలో అతిగా ప్రవర్తిస్తూ డిజెలను నిలిపివేస్తూ, బ్యాండ్ మేళాల బృందం వారిని వెళ్ళిపొమ్మంటూ శోభాయాత్రను త్వరగా ముగించాలని యువకులపై ఒత్తిడి చేయడంతో ఆందోళన మొదలైంది. దీంతో పోలీసుల తీరు నిరసిస్తూ యువకులు శోభాయాత్ర నిలిపివేసి, అంబేద్కర్ చౌక్ లోనే బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారని యువకు ఆరోపించారు. దీంతో సుమారు 200 కు పైగా గణేష్ విగ్రహాలను కిలోమీటర్ల పొడవున నిలిపివేశారు.
ఎస్పి అఖిల్ మహాజన్ వచ్చి శోభాయాత్రను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేయడంతో తెల్లవారుజాము నుండి ఉదయం 10 గంటల వరకు శోభయాత్ర నిలిచిపోయింది. వెంటనే జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఘటన స్థలానికి చేరుకుని హిందూ సమాజ్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో పాటు ఆయా మండలాల నిర్వాహకులతో చర్చలు జరిపారు. పెట్టిన కేసులు ఎత్తివేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో తిరిగి శోభాయాత్ర ప్రారంభమైంది. దీంతో యువకులు తమతమ గణనాథులను నిమజ్జనానికై తరలించడంతో గొడవ సద్దుమణిగింది.