మట్టిలో మాణిక్యం ‘బువ్వకుండ’
అన్నవరం దేవేందర్
తెలుగు సమాజ నిర్మాణం(Structure of Telugu Society)లో కుల వృత్తులు(Traditional caste-based occupations) కేవలం ఉపాధి మార్గాలు(Employment Avenues) మాత్రమే కాదు. అవి ఒక జీవన విధానం(Lifestyle), ఒక సంస్కృతి, ఒక సామాజిక అస్తిత్వం. అలాంటి శ్రామిక వృ త్తుల్లో కుమ్మరి వృత్తి అత్యంత ప్రధానమైనది. మట్టిని ముద్దగా చేసి, సారెపై తిప్పి, నిప్పులో కాల్చి మనిషి నిత్యజీవితానికి అవసరమైన పాత్రలను సృష్టించిన కుమ్మరి కేవలం పాత్రను చేయలేదు, మట్టికి ప్రాణం పోశాడు. ఈ అస్తిత్వాన్ని, దాని వెనుక ఉన్న శ్రమను, నేటి ఆధునిక కాలంలో ఆ వృత్తి ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని కవితా వస్తువుగా చేసుకుని 2016లో అన్నవరం దేవేందర్ రాసి వెలువరించిన అద్భుతమైన దీర్ఘకవిత ‘బువ్వకుండ’.
అన్నవరం దేవెందర్ ఆకలిపేగుల స్వరం. బొడ్డుమల్లెల అక్షరాల బొమ్మరిల్లు. బుడ్డపరుకల పరుగులతో బ తుకుల లోతులను చిత్రిక గట్టే మంకమ్మతోట లేబర్ అడ్డ. బాల్యాన్ని రాసినా, శ్రామిక మహిళల అణచివేతను వ్యక్తపరిచినా, పాలింకిపోయిన చెరువు గురించి రాసినా, తెలంగాణ ఉద్యమం గురించి రాసినా ఊరుయాదులైనా అతని కవిత్వం విరబూసిన సింగిడి. అక్షరాల జలపాతా లు.. మక్కకంకుల పొత్తులు. ముస్తాదు వొంపిన ఆకాశ జలపాతం.. పరికిపండ్లు పులిశింతకాయల పులుపులు.. తంగేడుపూల పరిమళాలు.. మందార మకరందాలు
.. వరిగొలుసుల సింగారం. నుడికారాలు, పలుకుబడులు, మాండలికాలతో సాహిత్యాన్ని పరిపుష్టంచేసిన అచ్చమైన సహజకవి. బహుజన ధిక్కారాన్ని సగవరంగా ఎగరేసిన కవి, కరీంనగర్ కవితా ఝరి అన్నవరం.
బువ్వకుండ పుట్టుక - ఒక తాత్విక ప్రతీక
కవి బువ్వకుండను ఇలా నిర్వచిస్తాడు:
అది బువ్వకుండ/ఆకాశంలోని శూన్యాన్ని/ముక్కలు ముక్కలుగా కత్తిరించి/సుట్టువార మట్టిగోడలు కట్టి/సృష్టించిన గుండెకాయ..
ఆకాశమంతా శూన్యం. ఆ శూన్యాన్ని మనిషి కోసి, చుట్టూ మట్టిగోడలు కట్టి సృష్టించిన గుండెకాయే ఈ పొయ్యి. ఇది కేవలం పొయ్యి కాదు, ఇంటి గుండెకాయ. మనిషి ప్రకృతిలోని శూన్యం నుండి తన అవసరం కోసం సృష్టించిన తొలి ఇంజనీరింగ్ అద్భుతం.
ఆహార తయారీకి ఆయువు/జీవన వికాసానికి తొలి పనిముట్టు/ఎప్పటికి అస్తమించని సూర్య మడుగు..
తిండి లేకపోతే ప్రాణం లేదు. ఆ ప్రాణాన్ని ఇచ్చేది ఈ కుండే. నిప్పును, పాత్రను వాడటం మనిషి నేర్చుకున్న తొలి టెక్నాలజీ. అందుకే ఇది జీవన వికాసానికి తొలి మెట్టు. సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు, కానీ వం టింట్లో ఈ బువ్వకుండలోని నిప్పు ఎప్పుడూ ఆరదు. అది ఆరని సూర్యుడు.
అన్నం వండే బువ్వకుండ/అందరికీ ఆదిమతల్లి/
కూర వండే ఆదిశక్తి/మంచిల్ల పట్టు దూప తీర్చే సల్వ..
ఇది కవితలో గుండెకాయ లాంటి భాగం. అన్నం పెట్టే అమ్మే తొలి దేవత కాబట్టి కవి ఆదిమతల్లి, ఆదిశక్తి అంటాడు. చలికాలంలో చలిమంట వెచ్చదనం దుప్పటి లాంటి సల్వలా దూపను, ఆకలిదప్పులను తీరుస్తుంది. ఇది చిన్న వస్తువులో పెద్దతత్వాన్ని చూపిన ప్రగతిశీల దృష్టి కోణం.
‘బువ్వకుండ’ అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది అన్నం. కానీ ఆ అన్నాన్ని మోసే కుండ వెనుక ఒక కుమ్మరి చేతి నైపుణ్యం, తరతరాల వృత్తి జ్ఞానం దాగి ఉంది. అందుకే ఇది కేవలం మట్టి పాత్ర కాదు, కుమ్మరి అస్తిత్వానికి ప్రతీక. దేవేందర్ ఈ ప్రతీకను పట్టుకోవడంలోనే ఈ కవిత ప్రత్యేకత దాగి ఉంది.
కవి దృష్టిలో కుమ్మరి సారె చక్రం కేవలం ఒక పనిముట్టు కాదు.. అది కాలచక్రం. ఒకప్పుడు ప్రతి పల్లె లోనూ కుండలు, బానలు, మూకుళ్లు, ప్రమిదలు, జాడీలతో మనిషి అవసరాలన్నీ మట్టిలోనే తీరేవి. కానీ నేడు ప్లాస్టిక్, స్టీల్, అల్యూమినియం విస్తరించడంతో మట్టి పాత్రల వినియోగం తగ్గి, సారె చక్రం నెమ్మదించింది. చక్రం నెమ్మదించడం అంటే ఒక కుటుంబ ఆదాయం తగ్గడం మాత్రమే కాదు, తరాల నాటి ఒక వృత్తిజ్ఞానం కనుమరుగవడం అని కవి ఆవేదన చెందుతారు.
వృత్తిని ఒక వ్యక్తి పనిగా చూడటం పొరపాటు. ఇది ఒక కుటుంబ సమష్టి శ్రమ వ్యవస్థ. మట్టిని గుర్తించడం, తేవడం, రాళ్లు ఏరి మెత్తగా చేయడం దగ్గరి నుండి.. సారెపై ఆకారం ఇవ్వడం, ఎండబెట్టడం, పగుళ్లు రాకుండా కాపాడటం, కొలిమిలో పేర్చి కాల్చడం, మార్కెటుకు తీసుకెళ్లడం వరకు ప్రతి దశలోనూ కుటుంబ భాగస్వామ్యం ఉంటుంది.
ఇందులో స్త్రీల శ్రమను ప్రత్యేకంగా గుర్తించాలి. ఇంటి పనులు, పిల్లల సంరక్షణతోపాటు మట్టి సిద్ధం చేయడం, కుండలను ఎండబెట్టడం, అమ్మకానికి సిద్ధం చేయడం వరకు వారి శ్రమ నిరంతరం కొనసాగుతుంది. కానీ ఈ శ్రమకు ప్రత్యేక వేతనం ఉండదు. వినియోగదారుడికి కనిపించేది కేవలం ఒక కుండ మాత్రమే. కానీ దాని వెనుక ఒక కుటుంబం చెమట, ఒక ఇంటి సమయం, తరతరాల నైపుణ్యం దాగి ఉంటుంది. ఇతరుల ఇళ్లకు జీవన పాత్రలను అందించే కుమ్మరి కుటుంబం, నేడు తన జీవనం కోసం పోరాడాల్సిన విరుద్ధ పరిస్థితే ‘బువ్వకుండ’లోని ప్రధాన విషాదం.
కవితలో కవి అన్నవరం దేవేందర్ చక్రం ప్రాధాన్యతను శాస్త్రీయ కోణంలో విశ్లేషించిన తీరు అద్భుతం.
‘మట్టిని పెకిలించి తెచ్చి / కుండగ, కూరటికగ ఆకారం తెచ్చుట/గిర గిర తిరిగే సారే మూలం/ సారె చక్రం యంత్ర సాంకేతికతకు కేంద్రం/
ప్రపంచ గమనాన్నీ, పనితనాన్ని వేగిర పరిచిన /మహాసాధనం/చక్రం, ఇరుసు, లోహం కనిపెట్టిన శాస్త్రజ్ఞు లారా! మీకెన్ని సలాములైనా సరిపోవు...’
నేల నుండి మట్టిని తవ్వి తెచ్చి, దానికి కుండలుగా, ప్రమిదలుగా ఒక అందమైన రూపాన్ని ఇవ్వడానికి కు మ్మరి చక్రం(సారె) ప్రధాన ఆధారం. మానవుడు నిర్మించిన ఆధునిక యంత్రాలన్నింటికీ, సాంకేతిక విప్లవానికి ఈ చక్రమే ఆదిమరూపం.. మరియు కేంద్ర బిందువు. చక్రం కనుగొనడం వల్లే మానవ జీవన గమనం వేగవంతమైంది, రవాణా వ్యవస్థ వేగపుంజుకుంది. చక్రాన్ని, దానిని నిలబెట్టే ఇరుసును కనుగొని మానవ ప్రగతికి బాటలు వేసిన ఆనాటి అజ్ఞాత పూర్వీకులకు, శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు కవి అన్నవరం.
కుండను తయారుచేయడంలో ఉండే శ్రమను, అందులోని కళాత్మకతను కవి ఎంతో సహజంగా కళ్లకు కట్టారు. ‘కుండ పిండంకు ప్రాణం పోయడం కోసం/ ఉపరితలం మీద సలపతో సరుస్తూ / లోపల మసి సల్లుకుం ట/ రౌతుతో నమోనగ అదిమి పట్టాలె / అప్పుడే సృష్టికారుని ఓర్పరితనం ధనిస్తది/....
అనుకున్న తీరుగ వచ్చేదాకా సరుస్తుండాలె...
నడుమ నడుమ తడిపిడుస తేమ అంటించి
నున్నగంటు సలప చిన్ననున్న రాయి/
సమన్వయ సవ్వడితోనే అందమైన ఆకారం నవ్వుతది..
ఎండిన కుండలన్నీ ఒకే దగ్గర చేర్చి / వాములో పేర్చుడు కాల్చుడు మహానైపుణ్యత
కుండ మీద కుండలు బ్రహ్మాండంగ బోర్లించాలె / పల్లద్దు కూలద్దు బహు నేర్పు నిర్మాణం...‘
ఇది కుమ్మరి శ్రమలోని ఓర్పుకు, నేర్పుకు అద్దం పట్టే కవిత. బయట సలపతో (చెక్క పనిముట్టు) సరుస్తూ, లోపల రౌతుతో (రాయి) అదుముతూ ఆకారాన్ని తెచ్చే క్రమంలోనే సృష్టికర్త ఓర్పు తెలుస్తుందని కవి చెబుతాడు. తడి, సలప, రాయి సమన్వయంతోనే అందమైన కుండ పుడుతుంది. తయారైన కుండలను ‘వాము’లో (కొలిమి) ఒకదానిపై ఒకటి పడిపోకుండా బ్రహ్మాండంగా బోర్లించి, కాల్చడం అనేది ఒక మహా నైపుణ్యం. ఇది మట్టికి ప్రాణం పోసే చేతుల వెనుక ఉన్న శాస్త్రీయతను, కళాత్మకతను చాటిచెబుతుంది.
శ్రమలోని తాత్వికత
‘ఉపరితలం మీద సలపతో సరుస్తూ లోపల మసి నల్లుకుంట’ -ఇది కుమ్మరి బతుకుకు ప్రతీక. పైకి నున్నగా కనిపించే కుండ వెనుక కాలిన చేతులు, మసి బట్టిన బతుకు ఉంటుంది. ‘రౌతుతో నెమ్మదిగా అదిమి పట్టాలి’ అనడంలోనే సృష్టికర్తకు ఉండా ల్సిన ఓర్పు, నైపుణ్యం కనిపిస్తాయి.
‘కోటిలింగాల హరప్పా మొహంజొదారో తవ్వకాలు/ఎక్కడ ఎల్లినవైనా కుమ్మరి పెంకలే/నాగరిక వికాసానికి అవే ఆనవాళ్లు/చరిత్ర వయస్సు నిర్ధారణకూ గీటురాళ్లు/ప్రాచీన చరిత్రలోనూ తొలి పని మట్టిపనే/మన్ను జీవి తమే అసలైన జీవితం.. ప్రపంచీకరణ మాయకన్న ముం దు నుంచే/కులవృత్తి కునారిల్లుతూ మొదలైంది/గ్లోబలీకరణ దెగచూపులకు అన్ని వృత్తుల్లానే/కుండలు వాడడం పూర్తిగా ఆగిపోయింది’..
ఈ పదాలలో వృత్తి చారిత్రక గొప్పతనాన్ని కవి
ఎత్తి చూపిన విధానం బాగుంది.
కోటిలింగాల నుంచి హరప్పా వరకు నాగరికత వికాసానికి, చరిత్ర వయస్సును కొలవడానికి కుమ్మరి పెంకు లే ఆధారమని చెబుతాడు. మానవుడి తొలిపని మట్టి పనియేనని, మన్నుతో ముడిపడిన జీవితమే అసలైన జీవితమని చాటుతాడు. కానీ ప్రపంచీకరణ మాయలో కులవృత్తులన్నీ కునారిల్లినట్లే, కుండల వాడకం కూడా పూర్తిగా ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తాడు.
కవి అన్నవరం దేవేందర్ ‘బువ్వకుండ’ కేవలం ఒక వస్తువు కథ కాదు. అది కుమ్మరి అస్తిత్వానికి, తరతరాల వృత్తి పరంపరకు, మట్టి సంస్కృతికి, శ్రమకు దక్కాల్సిన గౌరవానికి ప్రతీక. కనుమరుగవుతున్న ఒక జీవన సంస్కృతికి, కుమ్మరి చేతి మట్టికి సాహిత్య రూపంలో దక్కిన అరుదైన గౌరవం ఈ దీర్ఘకవిత. ఏడు భాగాలు, ఏడువర్ణాలుగా పొదిగి మట్టి గంభీరతను మట్టి సంస్కృతిని మట్టి వైభవాన్ని కవిత్వీకరిస్తూ... మట్టి కుండతో మొదలైన మనిషి జీవితం మట్టికుండతోనే అగ్గిల మాయం అంటూ ముగిస్తాడు.
వనపట్ల సుబ్బయ్య
9492765358