సీక్రెట్ డేటింగ్ పేరిట చీటింగ్!

23-09-2026 | 05:10am

శ్రీశైలం దూడం : 

చేతిలో సెల్‌ఫోన్(Cellphone).. తెరపై పరిచయం.. మాటల్లో మమకారం.. ఆపై రహస్య చాటింగ్(Secret chatting)! ఒక్క క్లిక్‌తో మొదలయ్యే పరిచయం ఎటు దారితీస్తుందో తెలియదు. ఫొటో, వీడియో, డబ్బు, బ్లాక్మెయిల్(Photo, video, money, blackmail) దాకా చేరితే ఒక వ్యక్తి సమస్య కాస్తా కుటుంబ సమస్యగా మారుతుంది. ప్రేమ కోసం వెతికిన పరిచయం.. మోసానికి బాట వేస్తే? నమ్మకం పేరుతో వ్యక్తిగత వివరాలు రాబట్టి, ఆ తర్వాత అదే సమాచారాన్ని ఆయుధంగా మార్చితే? సీక్రెట్ డేటింగ్(Secret dating) పేరుతో పెరుగుతున్న డిజిటల్ పరిచయాలను ఇక వ్యక్తిగత వ్యవహారంగా మాత్రమే చూసే పరిస్థితి లేదు.

గ్లీడెన్ వెల్లడించిన నగరాల వారీ వినియోగదారుల గణాంకాల్లో బెంగళూరు(Bengaluru)కు 18శాతం, హైదరాబాద్‌(Hyderabad)కు 17 శాతం, ఢిల్లీకి 11 శాతం, ముంబైకి 9శాతం, పుణెకు 7శాతం వాటా ఉంది. అంటే ఆ వేదికలో బెంగళూరు మొదటి స్థానంలో, హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నాయి. భారతదేశంలో ఆ వేదిక వినియోగదారులు నాలుగు మిలియన్లు దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి. భారత వినియోగదారుల్లో(Indian consumers) 65 శాతం పురుషులు, 35 శాతం మహిళలు కాగా, రెండేళ్లలో మహిళల భాగస్వామ్యం 148 శాతం పెరిగిందని సంస్థ తెలిపింది. ఈ గణాంకాలు ఒకే వేదికకు సంబంధించినవే.

అయినా రహస్య పరిచయాల కోసం ప్రత్యేక డిజిటల్ వేదికలకు(Digital platform) పెరుగుతున్న ఆదరణ కుటుంబ సంబంధాలపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 4.5 కోట్లకు పైగా భారతీయులు సీక్రెట్ లేదా డిస్క్రీట్ డేటింగ్ వేదికలను ఉపయోగించినట్లు లేదా పరిశీలించినట్లు ఒక నివేదిక పేర్కొంది. ఒక్క ఏడాదిలోనే 1.6 కోట్ల కొత్త నమోదులు జరిగినట్లు తెలిపింది. ఆ సంఖ్యను వివాహేతర సంబంధాల సంఖ్యగా చూడలేం. కానీ డిజిటల్ పరిచయాల విస్తృతి విస్మరించలేనిది. పరిచయం నేరం కాదు.. పరిచయాన్ని మోసానికి, బెదిరింపులకు, డబ్బు దోపిడీకి ఉపయోగించడమే అసలు ప్రమాదం.

569 ఫిర్యాదులు.. రూ.2.81 కోట్ల నష్టం

తెలంగాణలో 2025లో డేటింగ్ యాప్ మోసాలకు సంబంధించి 569 మంది బాధితులు ఫిర్యాదు చేసి, రూ.2.81 కోట్ల నష్టం జరిగినట్లు నివేదించబడింది. బాధితుల్లో 61 శాతం మంది 18-35 ఏళ్ల మధ్య వయస్కులేనని గణాంకాలు చెబుతున్నాయి. పెళ్లి పేరుతో నమ్మించడం, విదేశీయులమని చెప్పి సంబంధాలు పెంచడం, నకిలీ పెట్టుబడులు చూపించడం, క్రిప్టో కరెన్సీ పేరుతో డబ్బు తీసుకోవడం, సన్నిహిత వీడియోలను అడ్డుపెట్టి బెదిరించడం వంటి పద్ధతులు నమోదయ్యాయి.

డేటింగ్ యాప్‌లో మొదలైన పరిచయం డేటింగ్ దగ్గరే ఆగడం లేదు. డబ్బు, వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు దొరికితే అదే మోసగాళ్లకు కొత్త ఆయుధంగా మారుతోంది.  ప్రేమ, స్నేహం, పెళ్లి, ఉద్యోగం, వినోదం.. ఏ పేరుతో పరిచయం మొదలైనా, చివరికి వ్యక్తిగత సమాచారం కోసం వల వేయవచ్చన్నదే హెచ్చరిక. 

అపరిచితుడితో వీడియో కాల్ చేయడం, వ్యక్తిగత ఫొటోలు పంపడం, గుర్తింపు పత్రాలు లేదా బ్యాంకు వివరాలు పంచుకోవడం ప్రమాదకరం. తాజాగా ‘రెంట్- ఎ- బాయ్‌ఫ్రెండ్’ పేరుతో ముందస్తు బుకింగ్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ అడిగి, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి బ్లాక్మెయిల్ చేసే మోసాలపై కూడా హెచ్చరికలు వచ్చాయి.

పిల్లల దాకా... డిజిటల్ చీకటి

ఈ ముప్పు పెద్దలతోనే ఆగడం లేదు. సామాజిక మాధ్యమాలు, నకిలీ ప్రొఫైల్స్, వీడియో చాట్స్ ద్వారా చిన్నారులను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. డీప్ ఫేక్, కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలు అందుబాటులోకి రావడంతో నిజమైన చిత్రాలను మార్ఫింగ్ చేయ డం, నకిలీ చిత్రాలతో బెదిరించడం వంటి ముప్పులు పెరిగాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారుల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్‌ను ప్రోత్సహించే ప్రకటనలపై కేంద్రం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) దృష్టి సారించి న నేపథ్యంలో మెటా భారత దర్యాప్తు సంస్థలకు చిన్నారుల భద్రతకు సంబంధించిన కేసులను నేరుగా నివేదించేందుకు అంగీకరించింది. సమాచారం అందడం మొదటి అడుగు మాత్రమే; దానిపై వేగంగా దర్యాప్తు జరగడం, బాధిత చిన్నారిని రక్షించడం, నేరపూరిత దృశ్యాల వ్యాప్తిని అడ్డుకోవడం అంతే కీలకం. పిల్లల భద్రతను తల్లిదండ్రుల భుజాలపై మాత్రమే పెట్టి సామాజిక మాధ్యమ సంస్థలు తప్పించుకోలేవు.

ప్రమాదకర కంటెంట్‌ను ముందుగానే గుర్తించే అల్గారిథమ్‌లు, ఫిర్యాదులపై వేగవంతమైన స్పందన, నకిలీ ఖాతాల నిరోధం, డిజిటల్ ఆధారాల పరిరక్షణకు పటిష్టమైన వ్యవస్థలు అవసరం. ముఖ్యంగా అశ్లీల కంటెంట్  వ్యాప్తి మొదలయ్యే ముందే గుర్తించాలి. వ్యాపారం చేసే హక్కు ఉన్నట్టే, సమాజాన్ని కాపాడే బాధ్యత కూడా వేదికలపై ఉంటుంది. మెటా తాజా నిర్ణయం ఆ దిశగా ఒక ముందడుగు కావచ్చు. కానీ అది ముగింపు కాదు.

చిన్న చెడు విత్తనాలే.. పెద్ద చిచ్చుకు మూలం

రహస్య పరిచయం.. దాపరికం.. అబద్ధం.. వ్యక్తిగత చిత్రాల మార్పిడి.. డబ్బు లావాదేవీ.. బెదిరింపు.. ఇలా ఒక్కో అంశం మరోదానికి తోడైతే సమస్య వేళ్లూనుకుంటుంది. చిన్నచిన్న చెడు విత్తనాలు ఒకదానికొకటి పెనవేసుకుంటేనే మహావృక్షం రూపుదిద్దుకుంటుంది. ఇంట్లోనూ అంతే. ఆ మార్పును కుటుంబం గమనించకపోతే, శ్రద్ధ చూపకపోతే, ‘ఏమవుతుందిలే’ అంటూ ఉపేక్షిస్తే.. చివరకు అదే మహావృక్షమై కుటుంబాన్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో, భార్యాభర్తలు ఒకరితో ఒకరు, కుటుంబ సభ్యులు పరస్పరం మాట్లాడుకోవాలి.

కుటుంబం కాపలా కావాలి.. నిఘా కేంద్రం కాకూడదు. అనుమానం పెం చడం కాదు.. నమ్మకాన్ని పెంచే సంభాషణ మొదలుపెట్టడం ముఖ్యం. పిల్లలు ఆన్‌లైన్‌లో ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి. అదే సమయంలో వారిని భయపెట్టకుండా, సమస్య వచ్చినప్పుడు చెప్పుకునే ధైర్యం కల్పించాలి. డేటింగ్ మోసంలో నష్టం డబ్బుతో ముగియదు. వ్యక్తిగత చిత్రాలు బయటకు వస్తాయనే భయం, కుటుంబానికి తెలిసిపోతుందనే ఆందోళన, పరువు పోతుందనే భయం బాధితుడిని మరింత ఒత్తిడికి గురిచేస్తాయి.

అందుకే బ్లాక్‌మెయిల్‌కు డబ్బు చెల్లిస్తూ సమస్యను దాచిపెట్ట డం కంటే ఆధారాలను భద్రపరచి వెంటనే పోలీసులను ఆశ్రయించడం అవసరం. తెలంగాణలో సైబర్ నేరాల విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సైబర్ నేరాలు భవిష్యత్తులో అతిపెద్ద సవాల్‌గా మారనున్నాయని హెచ్చరించారు. సమస్యను కేవలం డేటింగ్ యాప్ వరకు కుదించలేం. డిజిటల్ ప్రపంచంలో మనిషి గోప్యత, డబ్బు, గౌరవం, కుటుంబబంధం అన్నీ ఒకే తెరపై ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది.

జాగ్రత్తే తొలి రక్షణ గోడ

అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను అంగీకరించకపోవడం, వ్యక్తిగత ఫొటోలు లేదా వీడియోలు పంపకపోవడం, ఓటీపీలు, పాస్‌వర్డులు పంచుకోకపోవడం, అనుమానాస్పద లింకులు తెరవకపోవడం, డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తికి డబ్బు పంపకపోవడం వంటి సాధారణ జాగ్రత్తలే తొలి రక్షణ గోడ. మోసం జరిగితే సిగ్గుపడకుండా ఆధారాలను భద్రపరచి వెంటనే ఫిర్యాదు చేయాలి. ఆర్థిక సైబర్ మోసాల్లో వెంటనే 1930కు ఫోన్ చేయవచ్చు. జాతీయ సైబర్ నేరాల నివేదికల పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

కుటుంబం నిందించే స్థలం కాకుండా అండగా నిలిచే స్థలంగా మారాలి. పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇచ్చినంత మాత్రాన డిజిటల్ భద్రత నేర్పినట్టుకాదు. పాఠశాలల్లో సైబర్ సురక్షిత ప్రవర్తనపై అవగాహన, ఇళ్లలో తెరచిన సంభాషణ, వేదికల్లో పటిష్టమైన భద్రతా వ్యవస్థలు.. ఈ మూడూ కలిసినప్పుడే రక్షణ గోడ బలపడుతుంది. సంబంధాల్లో వ్యక్తిగత స్వేచ్ఛకు స్థానం ఉంది. కానీ స్వేచ్ఛకు తోడు బాధ్యత, డిజిటల్ వివేకం కూడా ఉండాలి. సాంకేతికతను ఆపడం సాధ్యం కాదు; దాని దుర్వినియోగాన్ని అడ్డుకోవడం మాత్రం సాధ్యం.

ఒక అపరిచిత పరిచయం ఎప్పుడు నమ్మకంగా మారుతుందో, ఆ నమ్మకం ఎప్పుడు మోసగాడి ఆయుధంగా మారుతుందో గుర్తించడం కష్టం. అందుకే ప్రతి క్లిక్ ముందు ఒక్కసారి ఆలోచించాలి. పిల్లల చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే పక్కనే సంస్కారం ఉండాలి; పెద్దల చేతిలో డేటింగ్ యాప్ ఉంటే పక్కనే వివేకం ఉండాలి. కుటుంబాన్ని కాపాడేది కేవలం తలుపుల తాళాలు కాదు.. పరస్పర నమ్మకం, తెరచిన సంభాషణ, డిజిటల్ జాగ్రత్త. సీక్రెట్ డేటింగ్ ఉచ్చు బయట కనిపించకపోవచ్చు.. కానీ అప్రమత్తమైన కుటుంబం దానికి చిక్కకుండా నిలబడగలదు. 

వ్యాసకర్త: ఫ్రీలాన్స్ జర్నలిస్టు, 9133947176

మరిన్ని వార్తలు