కరెంట్ కోసం మిర్చి రైతుల పోరుబాట
- 78 గంటల సరఫరాతో పంటలు ఎలా పండించాలి..?
- 20 గంటలు ఇవ్వాలని డిమాండ్
- ఎమ్మెల్సీ దండే విఠల్‌కు రైతుల వినతి
కౌటాల, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): మిర్చి పంటల(Chilli crops)కు సాగునీరు(Irrigation water) అందించేందుకు విద్యుత్ సరఫరా సమయాన్ని పెంచాలని కోరుతూ గుండాయిపేట్ సబ్స్టేషన్(Gundaipet Substation) పరిధిలోని 11 గ్రామ పంచాయతీలకు(Village Panchayats) చెందిన మిర్చి రైతులు(Chilli farmers) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ను కలిసి వినతిపత్రం అందజేశారు.ప్రస్తుతం రోజుకు కేవలం 78 గంటల పాటు మాత్రమే త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అవుతుండటంతో మిర్చి పంటలకు సకాలంలో నీరు అందించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట కీలక దశలో ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా తక్కువగా ఉండటంతో సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
20 గంటల విద్యుత్ కావాలి
20 గంటల విద్యుత్ కావాలి.. పంటను కాపాడుకోవాలి అంటూ రైతులు తమ సమస్యను ఎమ్మెల్సీ దండే విఠల్ దృష్టికి తీసుకెళ్లారు. మిర్చి సాగుకు అవసరమైన విద్యుత్ సరఫరాను పెంచాలని కోరారు.రైతుల సమస్యపై ఎమ్మెల్సీ దండే విఠల్ వెంటనే స్పందించారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి గుండాయిపేట్ సబ్స్టేషన్ పరిధిలోని మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు. రైతులకు అదనంగా విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.
స్పందించిన అధికారులు అదనంగా రెండు గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. వారం రోజుల అనంతరం ఉన్నతాధికారులతో చర్చించి, రానున్న రబీ సీజన్లో రోజుకు కనీసం 20 గంటల విద్యుత్ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు.
రైతుల ఆశలు.. అధికారుల హామీ..
విద్యుత్ సరఫరా పెంపుపై అధికారులు ఇచ్చిన హామీతో మిర్చి రైతులు ఊరట వ్యక్తం చేశారు. అయితే రానున్న రబీ సీజన్లో ఇచ్చిన హామీ మేరకు 20 గంటల విద్యుత్ సరఫరా అందించి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.