అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్..

22-09-2026 | 11:31pm

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తాండూర్, బెల్లంపల్లి లో చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) పరిశీలించారు. మంగళవారం ఆయన జిల్లాలోని తాండూర్ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించారు. పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు.

మండలంలోని ద్వారకాపూర్ గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను మండల తహసిల్దార్ జ్యోత్స్న తో కలిసి పరిశీలించారు. భూ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ నక్షాలు, రైతుల సంబంధిత భూముల నిర్ధారణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా రికార్డులతో సరి చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, చర్యలు తీసుకోవాలనన్నారు.

భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి, ఆసరా పింఛన్ల దరఖాస్తుల పరిశీలన వివరాలను పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. ఇదెక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.

ఆరోగ్య కేంద్రం పరిధిలో గల గర్భిణుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవ అందించాలన్నారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు. మండల తహసిల్దార్ కార్యాలయాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తో కలిసి సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో మ్యాపింగ్ కాని, అనమలిస్ జాబితాలో ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఓటర్లు అందిస్తున్న ధ్రువపత్రాల పరిశీలను పరిశీలించారు.

- బెల్లంపల్లిలో గోశాలకు భూమిపూజ..

బెల్లంపల్లి మండల కేంద్రంలో భారత జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో తలపెట్టిన గోశాల కొరకు డీసీపీ ఎ.భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జాతీయ రహదారుల సంస్థ పి.డి. అజయ్ మణికుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, తహసిల్దార్ కృష్ణ లతో కలిసి భూమి పూజ చేశారు. గోశాల కొరకు జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో 1 ఎకరం 15 గుంటల విస్తీర్ణంలో గోశాల నిర్మాణం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు