ఓబీసీ హక్కులకు కాంగ్రెస్ ప్రచార రెక్కలు!
- దేశవ్యాప్తంగా 100 రోజుల కార్యాచరణ
- ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఇవ్వాలి
- కేంద్రానికి ఏఐసీసీ ఓబీసీ సెల్ డిమాండ్
- తెలంగాణలో లక్ష మందితో ఓబీసీ సభ
- ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు
- ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో ఓబీసీ విభాగం సమావేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి) : దేశంలో జరుగుతున్న జాతీయ కులగణనలో ఓబీసీలను పూర్తి స్థాయిలో లెక్కించడంతో పాటు, ప్రతి ఓబీసీ కులానికి ఒక కోడ్‌ను కేటాయించాలనే డిమాండ్‌తో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party)100 రోజుల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఏఐసీసీ ఆధ్వర్యంలో ‘ ఓబీసీ హక్కుల గర్జన ’ (OBC Rights Roar)పేరుతో నిర్వహించే ప్రచారాన్ని ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో మంగళవారం ప్రారంభించారు.
దేశ వ్యాప్తంగా బలమైన ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఓబీసీ కో ఆర్డినేటర్ కొప్పుల రాజు, జాతీయ ఓబీసీ చైర్మన్ అనిల్ జైహింద్, జాతీయ మైనార్టీ విభాగం చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్‌గడి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, కర్ణాటక మంత్రి ఎండీ అహ్మద్ జమీర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్, ఓబీసీ జాతీయ కో ఆర్డినేటర్ రుద్ర సంతోష్‌కుమార్‌తో పాటు వివిధ రాష్ట్రాల ఓబీసీ, మైనార్టీల విభాగాల చైర్మన్లు , జాతీయ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ కులగణనలో ఓబీసీలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుండటంతో భవిష్యత్తులో ఓబీసీల జనాభా, సామాజిక-.. ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కులగణన అనేది కేవలం జనాభా లెక్కింపు కాదని, ప్రతి కులానికి సరైన గుర్తింపు, ప్రత్యేక కోడ్, కచ్చితమైన జనాభా నమోదు ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ బలమైన స్వరమని, - ఓబీసీల హక్కులు, కులగణన, సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ దేశంలో బలమైన స్వరం వినిపిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సామాజిక న్యాయం దిశగా కీలకమైన అడుగు పడిందన్నారు.
తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా సమగ్ర కులగణనతో పాటు ప్రతి ఓబీసీ కులాన్ని సరిగ్గా నమోదు చేసి, ప్రత్యేక కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓబీసీల హక్కులు, కులగణనపై అవగాహన కల్పించేందుకు లక్ష మందితో భారీ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
జనాభా ఆధారంగా సమాన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ఓబీసీ హక్కుల గర్జనలో భాగంగా దేశవ్యాప్తంగా ఓబీసీ కమ్యూనిటీ సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, జిల్లాలో ర్యాలీలు, పాదయాత్రలు, ప్రజా సమావేశాలు, మీడియా సమావేశాలు, డిజిటల్ ప్రచారాలు నిర్వహించాలన్నారు.