అసెంబ్లీ లాబీల్లో మీడియాకు ఆంక్షలు ఉండవు

09-09-2026 | 05:15am
  1. టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే నేతలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ 
  2. ఎమ్మెల్సీ వ్యాఖ్యల నేపథ్యంలో ఫెడరేషన్ సంఘీభావం 

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): శాసనసభ లాబీల్లో (Legislative Assembly lobbies) మీడియా ప్రతినిధులకు ఎటువంటి ఆంక్షలు ఉండబోవని, గతంలో మాదిరిగానే లాబీల్లో మీడియా రాకపోకలు సాగించవచ్చని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) ప్రతినిధుల బృందం స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, ప్రసాద్ కుమార్‌కు సంఘీభావం ప్రకటించారు. అసెంబ్లీ లాబీల్లోకి మీడియాను రానివ్వరనే ప్రచారం జరుగుతోందని ఫెడరేషన్ నేతలు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా కవరేజ్ సమయంలో మీడియాకు ఎదురవుతున్న పలు సమస్యలను ఆయనకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ ప్రసాద్ కుమార్.. లాబీల్లో మీడియాపై ఆంక్షలు విధించే ఎలాంటి ఆలోచన లేదని తేల్చిచెప్పారు.

గతంలో ఏ విధంగా ఉందో, ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగుతుందని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు అసెంబ్లీలో ఏమైనా సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరిస్తానని హామీనిచ్చారు. స్పీకర్‌ను కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవ పున్నయ్య, హెదీచ్‌యూజే అధ్యక్షుడు బి అరుణ్ కుమార్, ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బట్టిపాటి రాజశేఖర్, కార్యదర్శి గండ్ర నవీన్, హెదీచ్‌యూజే నాయకులు ప్రదీప్ ఉన్నారు.


మరిన్ని వార్తలు