25 February, 2026 | 4:25 AM

ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్ ‘పాలి-ట్రిక్స్’

25-02-2026 12:59 AM
  1. బీఆర్‌ఎస్ కోటలో చీలికలు తప్పవా?

గెలిచినా దక్కని చైర్మన్ పీఠం..

కిడ్నాప్ డ్రామాలు, కోర్టు స్టేలు, ఫిర్యాదుల పర్వంతో హీటెక్కిన రాజకీయం

రంగారెడ్డి, ఫిబ్రవరి 24(విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠం రోజుకో మలుపు తిరుగుతుంది. శాంతియుతంగా సాగాల్సిన మున్సిపల్ రాజకీయం ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ఓ హై-వోల్టేజ్ సినిమాను తలపిస్తోంది. సంఖ్యాబలం ఉన్నా బీఆర్‌ఎస్ గుండెల్లో వణుకు.. బలం లేకపోయినా పీఠాన్ని కైవసం చేసుకోవాలనే కాంగ్రెస్ పట్టుదల.. వెరసి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఇప్పుడు రాజకీయ కుట్రలకు, వ్యూహ ప్రతివ్యూహాలకు వేదికైంది.

చదరంగంలో పావులు కదుపుతూ కాంగ్రెస్ స్కెచ్ వేస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ కేవలం 8 వార్డులకే పరిమితమైనప్పటికీ, అధికారాన్ని దక్కించుకోవడంలో ఆయన చూపుతున్న తెగింపు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 24 వార్డులకు గాను మ్యాజిక్ ఫిగర్ 13 కాగా, బీఆర్‌ఎస్ వద్ద 15 మంది (స్వతంత్ర, బీజేపీ అభ్యర్థుల మద్దతుతో) కౌన్సిలర్లు ఉన్నారు. కానీ, ఇక్కడే కాంగ్రెస్ తన అసలైన ‘పాలి-ట్రిక్స్’ మొదలుపెట్టింది.

తాయిలాల గాలం వేయడం..

బీఆర్‌ఎస్ క్యాంపులోని ముగ్గురు కౌన్సిలర్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే ఒక కౌన్సిలర్ కాంగ్రెస్కు జై కొట్టడంతో బీఆర్‌ఎస్ శిబిరంలో ఆందోళన మొదలైంది. దీంతో లీగల్ అస్త్రాల ను ప్రదర్శిస్తుంది. మున్సిపల్ లో 23వ వార్డు కౌన్సిలర్ కుల ధ్రువీకరణ పత్రంపై, 21వ వార్డు కౌన్సిలర్ డబుల్ ఓటుపై ఫిర్యాదులు చేస్తూ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఈ రాజకీయ రణంలో 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం పెద్ద దుమారాన్నే రేపింది. ఆయనను బీఆర్‌ఎస్ నేతలే కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో.. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు బంటికి పోలీసులు నోటీసులు జారీ చేయడం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వివాదం చివరకు కోర్టు మెట్లు ఎక్కడంతో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ స్తంభించిపోయింది.

క్యాంపు రాజకీయాలు.. పహారాలో కౌన్సిలర్లు..

తమ కౌన్సిలర్లు చేజారిపోకుండా ఉండటానికి బీఆర్‌ఎస్ హైకమాండ్ అప్రమత్తమైంది. 14 మంది కౌన్సిలర్లను రహస్య ప్రాంతంలో క్యాంపుకు తరలించారు. వారి వద్ద ఫోన్లు పని చేయకుండా బయటి వ్యక్తులతో కాంటాక్ట్ లేకుండా... తమ శిబిరం నుంచి ఎవరు చేజారకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.అయినా కాంగ్రెస్ నేతలు తగ్గడం లేదు. కౌన్సిలర్లు దొరకకపోతే వారి కుటుంబ సభ్యులతో మంతనాలు జరుపుతూ ’ఆకర్ష్’ మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు.

మున్సిపల్ పీఠంపై ’ఎవరిది పైచేయి?..

ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది.. బీఆర్‌ఎస్ (13) 2 (మద్దతు స్వతంత్ర)  క్యాంపులో ఉంటూ పీఠం కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా, కాంగ్రెస్ కు  8 + 1 ఎక్స్ అఫీషియో (ఎమ్మెల్యే ఓటు) తో పాటు అదనంగా 3-4 మంది కోసం ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. అయితే ఇందులో చైర్మన్ ఎన్నిక విషయం లో కోర్టు తీర్పులు కీలక మలుపు తిరిగింది.కలెక్టర్ నివేదిక ఆధారంగా ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్నదే సస్పెన్స్... మాత్రం కొనసాగుతుంది.అయితే ఎన్నిక మంత్రి పదవి రేసులో ఉన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఇది ప్రతిష్టాత్మక సమస్యగా మారింది.

అటు పరువు నిలబెట్టుకోవాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఇరుపక్షాల ఎత్తులు, పైఎత్తులతో ఇబ్రహీంపట్నం పీఠం ఎవరికి దక్కుతుందో తెలియక సామాన్య జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ కు క్లైమాక్స్ ఎప్పుడు? ఎవరూ ఆఫీసియల్ గా  బాధ్యతలు చేపడుతున్నారాన్నదే. అనేది ప్రస్తుతం కాలమే నిర్ణయించాలి.