భక్తజన సంద్రం యాదగిరిగుట్ట
- ధర్మ, స్పెషల్ దర్శనాలకి 3, 2 గంటలు
- పాత గుట్టలో వైభవంగా ఉట్ల ఉత్సవం
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshmi Narasimhaswamy) దివ్య క్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. శ్రావణమాసం ఆదివారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు యాత్రికులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు యాదగిరిగుట్ట భక్తులతో కిటకిటలాడింది. యాదగిరిగుట్ట కొండపైన వాహనాల రద్ది పెరగడంతో కొండపైకి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాహనాలను అనుమతించలేదు.
కొండ కింద రింగురోడ్డులో వాహనాలతో పరిసరాలన్నీ నిండిపోయాయి. ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. ధర్మ దర్శనం, స్పెషల్ దర్శన క్యూ లైన్లు, ప్రసాద విక్రయశాల క్యూ కాంప్లెక్స్‌లలో భక్తులు బారులు తీరారు. స్వామివారి దివ్య క్షేత్రంలో నిత్య పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాత గుట్టలో ఉట్ల ఉత్సవంలో ఈవో భవాని శంకర్ పాల్గొన్నారు.






