కల్తీకి కళ్లెం.. సురక్షిత ఆహారం!
దుండ్ర కుమారస్వామి :
మనిషి జీవితంలో ఆహారం కేవలం ఆకలి తీర్చే సాధనం కాదు.. అది ఆరోగ్యానికి(Health) ఆధారం, కుటుంబానికి భరోసా, సమాజ అభివృద్ధికి పునాది. రేపటి భోజనం దొరుకుతుందా? దొరికే ఆహారం సురక్షితమేనా? అందులో అవసరమైన పోషకాలు(Nutrients) ఉన్నాయా? ప్రతి కుటుంబం దాన్ని అందుకునే స్థోమత కలిగి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే నిజమైన ఆహార భద్రత(Food Security) సాధ్యమవుతుంది. తెలంగాణలో ఇప్పుడు ఇదే కీలక ప్రశ్న. రాష్ట్రంలో ఆహార, ఔషధ కల్తీని(Drug Adulteration) అరికట్టేందుకు మరింత కఠినమైన వ్యవస్థ అవసరమని ప్రభుత్వం చెబుతోంది.
ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు, పాలు తదితరాల్లో కల్తీపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక చట్టం రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు విజిలెన్స్/విజిల్‌బోయర్ వ్యవస్థ(Whistleblower system), టోల్‌ఫ్రీ నంబర్ వంటి చర్యలను కూడా పరిశీలిస్తున్నట్లు అధికారికంగా వెల్లడైంది. త్పత్తుల ప్యాకెట్లపై తప్పనిసరిగా ఉండాల్సిన బ్యాచ్ నంబర్, లైసెన్స్, తయారీ, గడువు తేదీ వంటి వివరాలు కూడా లేవని గుర్తించారు.
కల్తీ కథ.. కిచెన్ నుంచే మొదలవుతుందా?
హైదరాబాద్‌లో ఇటీవల వెలుగుచూసిన కల్తీ ఘటనలు ఆహార భద్రతపై ప్రశ్నలను మరోసారి ముందుకు తెచ్చాయి.130 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. సుమారు 36 టన్నుల కల్తీ నెయ్యి, ముడి పదార్థాలు, కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. చౌక నూనెలు, కృత్రిమ రుచులు వంటి పదార్థాలతో నెయ్యిని పోలిన ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నట్లు తేలింది. కొన్ని ఉత్పత్తుల ప్యాకెట్లపై తప్పనిసరిగా ఉండాల్సిన బ్యాంచ్ నంబర్, లైసెన్స్, తయారీ, గడువు తేదీ వంటి వివరాలు కూడా లేవని తనిఖీల్లో బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.
ఇది ఒక్క నెయ్యి విషయమే కాదు. మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్న ప్రతి ఆహార పదార్థం మనం అనుకున్నట్టే ఉంటుందా? ప్యాకెట్‌పై కంపెనీ పేరు, రంగు, వాసన, ఆకర్షణీయమైన లేబుల్ చూసి నాణ్యతను నిర్ణయించగలమా? వినియోగదారుడి చేతికి చేరే వరకు ఎన్ని దశలు దాటుతోంది? ప్రతి దశలో నిఘా ఎంత వరకు ఉంది? అన్నదే అసలు ప్రశ్న. అందుకే ఆహారభద్రత కోసం తనిఖీలు, సరఫరా గొలుసు పర్యవేక్షణ, పరీక్షలు తప్పనిసరి.
ఆహారం ఉండటం వేరు.. భద్రత వేరు
ఆహార భద్రత అంటే గోదాముల్లో ధాన్యం ఉండటం మాత్రమే కాదు. ప్రజలందరికీ అన్ని వేళలా సురక్షితమైన, పౌష్టికమైన ఆహారం అందుబాటులో ఉండటమే దాని అసలు అర్థం. ఆహారం లభించాలి.. కొనగలిగే స్థోమత ఉండాలి.. పోషక విలువ ఉండాలి.. అది సురక్షితంగా ఉండాలి.. ఈ భరోసా నిరంతరం కొనసాగాలి. రైతు పొలంలో పండించిన పంట నుంచి వినియోగదారుడి ప్లేట్ వరకు ఆహారం అనేక దశలు దాటుతుంది. సాగు, కోత, నిల్వ, రవాణా, మార్కెట్, ప్రాసెసింగ్, వంట, ప్యాకేజింగ్, విక్రయంప్రతి దశలో నాణ్యతను కాపాడాలి. ఒక దశలో జరిగిన నిర్లక్ష్యం చివరకు వినియోగదారుడి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ముడిసరుకుపైనే మొదటి నిఘా
కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం, మసాలాలు, నూనెలు వంటి ముడిసరుకును విశ్వసనీయమైన, నమోదైన సరఫరాదారుల నుంచి సేకరించే విధానం బలోపేతం కావాలి. ఏ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఎంతకాలం నిల్వ ఉంది? అనే వివరాలు డిజిటల్గా నమోదు చేస్తే నాణ్యత సమస్య తలెత్తినప్పుడు మూలాన్ని గుర్తించడం సులభమవుతుంది.
పరిశుభ్రతకు అసలు పరీక్ష వంటగది
రెస్టారెంట్‌లో భోజనం చేసే వినియోగదారుడికి వంటగది లోపలి పరిస్థితులు సాధారణంగా కనిపించవు. అందుకే వంటగది పరిశుభ్రత, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, ముడివండిన ఆహారం నిర్వహణ, నిల్వ ఉష్ణోగ్రతలు, పురుగుల నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై క్రమం తప్పని తనిఖీలు అవసరం. హైదరాబాద్లోని ఒక క్పే తనిఖీలో లైసెన్స్ ప్రదర్శించకపోవడం, ఫ్లై ట్రాప్లు లేకపోవడం, ఆహారాన్ని సక్రమంగా కవర్ చేయకపోవడం, ఫుడ్ హ్యాండ్లర్ల వైద్య రికార్డులు లేకపోవడం, కిచెన్ పరిశుభ్రత లోపాలు వంటి అంశాలు గుర్తించినట్లు నివేదిక వచ్చింది.
క్లౌడ్ కిచెన్.. కొత్త సవాల్
ఆన్‌లైన్ ఆర్డర్లతో క్లౌడ్ కిచెన్ల సంఖ్య పెరుగుతున్న సమయంలో మరో ప్రశ్న తలెత్తుతోంది. వినియోగదారుడికి కనిపించని వంటగదిలో ఆహారం ఎలా తయారవుతోంది? ముడిసరుకు ఎలా నిల్వ చేస్తున్నారు? సిబ్బంది పరిశుభ్రత ఎలా ఉంది? ప్యాకేజింగ్ ఎలా చేస్తున్నారు? డిజిటల్ యుగంలో ఆహారం ఆర్డర్ చేయడం సులభమైంది. అదే స్థాయిలో ఆహారం సురక్షితంగా ఉందనే నమ్మకాన్ని కూడా డిజిటల్ వ్యవస్థ కల్పించగలగాలి.
ఉపాధికి ఊతం.. నాణ్యతకు పెద్దపీట
హైదరాబాద్ సహా తెలంగాణ పట్టణాల్లో స్ట్రీట్ ఫుడ్ జీవనశైలిలో భాగమైపోయింది. అదే సమయంలో వేలాది మంది చిన్న వ్యాపారులకు అది జీవనోపాధి. కాబట్టి వారిని కేవలం నియంత్రించడం కాకుండా.. ప్రత్యేక ఫుడ్ జోన్లు, పరిశుభ్రమైన నీరు, వ్యర్థాల నిర్వహణ, ఆహార భద్రతపై శిక్షణ, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి.
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులపై పర్యవేక్షణను మరింత పెంచేందుకు ఆహార భద్రత అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో నమోదైన ఆహార వ్యాపార సంస్థల సంఖ్య కంటే వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు పేర్కొన్నట్లు నివేదికలు వచ్చాయి.
గడువు దాటితే ముప్పే..
హైదరాబాద్‌లో డార్క్ స్టోర్ల పై నిర్వహించిన తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పరిశుభ్రత లోపాలు, పురుగులు, ఎలుకల సమస్యలు, ఫంగస్ పట్టిన కూరగాయలు బయపడ్డాయి. నాలుగు సంస్థల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. ఇది కేవలం వ్యాపార సంస్థ సమస్యగా చూడొద్దు. ఆహారం వినియోగదారుడి ఇంటి గుమ్మం చేరే ముందు ఎన్ని దశలు దాటుతుందో.. ప్రతి దశలోనూ నాణ్యతను నిర్ధారించే వ్యవస్థ ఎంత బలంగా ఉందో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.
డిజిటల్ ట్రాకింగ్..
ముడిసరుకు నుంచి తుది ఉత్పత్తి వరకు డిజిటల్ ట్రేసబిలిటీని పెంచడం ద్వారా ఆహార సరఫరా గొలుసులో పారదర్శకత తీసుకురావచ్చు. తయారీ తేదీ, బ్యాచ్ నంబర్, గడువు తేదీ, నిల్వ పరిస్థితులు, నాణ్యత పరీక్ష వంటి వివరాలను సులభంగా తెలుసుకునే వ్యవస్థ వినియోగదారుడి నమ్మకాన్ని పెంచగలదు.ఆహారం ఎక్కడ తయారైందో తెలుసుకోవడం మాత్రమే కాదు.. నాణ్యతలో లోపం తలెత్తితే బాధ్యత ఎవరిదో కూడా తెలుసుకునే వ్యవస్థ రావాలి.
ప్రతి దశలో బాధ్యతతోనే భద్రత
ప్రభుత్వం తనిఖీలు చేయాలి. అధికారులు నిబంధనలు అమలు చేయాలి. వ్యాపారులు ప్రమాణాలు పాటించాలి. ప్రయోగశాలలు పరీక్షలను వేగంగా నిర్వహించాలి. వినియోగదారుడు కూడా అనుమానాస్పద ఆహారంపై ఫిర్యాదు చేసే అవకాశం పొందాలి. ప్రభుత్వం ప్రత్యేక చట్టంపై కసరత్తు చేస్తూ ప్రజల నుంచి సూచనలు, ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థలపై కూడా దృష్టి పెట్టడం ఈ దిశలో కీలకమైన అడుగుగా నిలవొచ్చు. కల్తీపై కఠిన చర్యలు అవసరం.
కానీ అదే సమయంలో వ్యాపారులకు స్పష్టమైన మార్గదర్శకాలు, చిన్న ఆహార వ్యాపారులకు శిక్షణ, పరిశుభ్రత మౌలిక సదుపాయాలు, వేగవంతమైన పరీక్ష ప్రయోగశాలలు, పారదర్శక తనిఖీ విధానం కూడా అవసరం. నిబంధనల భయం మాత్రమే కాదు.. నాణ్యతను పాటించడం వల్ల కలిగే నమ్మకం కూడా ఆహార వ్యవస్థలో భాగం కావాలి. తెలంగాణలో ఆహార భద్రతను ఇక కేవలం తనిఖీలు, కేసులు, సీజ్‌లు, జరిమానాల స్థాయిలో కాకుండా.. ముడిసరుకు నుంచి మనిషి ప్లేట్ వరకు ప్రతి దశలో నాణ్యతకు హామీ ఇచ్చే సమగ్ర ప్రజారోగ్య వ్యవస్థగా తీర్చిదిద్దాల్సిన సమయం ఆసన్నమైంది.
వ్యాసకర్త:
సామాజికవేత్త, న్యాయవాది,
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు,
9959912341