అభివృద్ధి సరే.. అవస్థల మాటేంటి..?

24-09-2026 | 05:20am
  1. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో పనుల సాగతీత 
  2. వీధులలో ప్రయాణానికి ప్రజలకు తప్పని అవస్థ
  3. ఓకే చోట పలుమార్లు తవ్వకాలతో తీవ్ర ఇబ్బందులు

సూర్యాపేట రూరల్, సెప్టెంబర్ 23 : పట్టణాభివృద్ధి పేరుతో సూర్యాపేట మున్సిపాలిటీ(Suryapet Municipality) పరిధిలో సాగుతున్న తవ్వకాలు ప్రజలకు అసౌకర్యంగా మారుతున్నాయి. ‘చేతు లు కాలాక ఆకులు పట్టుకున్నట్లు‘ సాగదీత పనులతో అధికారులు, కాంట్రాక్టర్లు(Contractors) స్థానికులను ఇబ్బందులు గురి చేస్తున్నారని స్థానికంగా వినిపిస్తుంది.

గల్లీ గల్లీలో రోడ్లు తవ్వి అండర్ గ్రౌండ్ పైపులు వేయడం,ఆ వెంటనే మట్టిపూడ్చి వెళ్లడం.. కొద్ది రోజులకే అదే చోట వాటర్ లీకేజ్(Water leakage) అంటూ,మాన్హోల్ అంటూ మళ్లీ జేసీబీలతో తవ్వడం పరిపాటిగా సాగుతుంది అని వాపోతున్నారు.ఒకే సారిగా పనిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తే బాగుండు అని పదే పదే చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ప్రజాధనం వృధా..?

ఒకసారి తవ్వి పైపులు వేసి మట్టి పూడ్చిన తర్వాత, మళ్లీ అదే చోట  కొన్ని రోజులకే తవ్వడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ప్రజాధనం వృధా కాదా అని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసలు పనులు చేసేటప్పుడు ప్రణాళిక ప్రకారం చేస్తే తిరిగి అదే పనిని  చేయవలసి రాదంటున్నారు. ఇలా చేయడం వలన ప్రజా ధనం వృధా  అవుతుందని గుసగుసలాడుతున్నారు. 

తప్పని ప్రమాదాలు ..

పైప్లైన్ పనులు ఒక కొలిక్కి వచ్చాయనుకునే లోపే, మ్యాన్హోల్స్ నిర్మాణాల పేరిట మళ్లీ తవ్వకాలు మొదలుపెడుతున్నారని, రోడ్ల మధ్యలో గుంతలు తవ్వి మ్యాన్హోల్స్ నిర్మించడం,ఆపై ఆ గుంతలను సరిగ్గా పూడ్చకపోవడంతో వాహనదారులు,కాలినడకన వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో శ్రీరాంనగర్ లో ఓ వ్యక్తి కార్పెంటర్ పని ముగించుకుని ఇంటికి వెళ్లు క్రమంలో ఇదే మ్యాన్హోల్ లో పడి తన కుడి కాలు విరిగిపోయింది. దీంతో అతను మంచానికే పరిమితమయ్యాడు.

నాణ్యతలేని పనులు!

పదే పదే తవ్వడానికి బాధ్యులు ఎవరు? ఇది కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా? లేక పనులను పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ అధికారుల తప్పిదమా? అని ప్రజలు నిలదీస్తున్నారు. చేసే పనిలో నాణ్యత లేకపోవడం వల్లే ఈ సమస్య వస్తోందని, దీనికి ఎవరిని నిందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..!

అన్నింటికంటే ముఖ్యంగా పనుల నిర్వహణలో స్పష్టమైన వివక్ష కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.మున్సిపాలిటీలో 31, 44 ఇలా కొన్ని వార్డులలో ఇలా కొంత మేరకు తవ్విన వెంటనే సిమెంట్ రోడ్లు వేస్తున్న అధికారులు, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం గుంతలు తవ్వి మట్టి పోసి వదిలేస్తున్నారు. వర్షాకాలం కావడంతో ఈ గుంతలన్నీ వర్షపు నీటితో నిలిచిపోయి బురదమయంగా మారాయి.వీధిని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఈ వ్యత్యాసం ఉందని, అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. తేడా ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఈ దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణికులు,ఆటో డ్రైవర్లు,ద్విచక్ర వాహనదారులతో పాటు వృద్ధులు నడుములు పట్టుకుని విలవిలలాడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి, నాణ్యతా లోపాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని,తవ్విన ప్రతీ రోడ్డును వెంటనే పునరుద్ధరించి సీసీ రోడ్లు వేయాలని సూర్యాపేట పట్టణ ప్రజలందరూ ఒక్కమాటగా డిమాండ్ చేస్తున్నారు.

 నడవడానికి ఇబ్బందిగా ఉంది                

కొన్ని గల్లీలలో రోడ్డు తవ్వి పైప్ లైన్ లు వేసి ఆ రోజే సీసీ రోడ్లు వేస్తున్నారు. కానీ మేమేం పాపం చేశాం.మా దగ్గర మాత్రం అలాగే మట్టి పోసి వదిలేశారు. అందులో నీరు నిలిచి బురద బురద అవడం వల్ల నడవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. స్కూల్ పిల్లలు బండి మీద వెళ్లేటప్పుడు ఆ బురద నీరు వారి దుస్తులపై, బ్యాగులపై పడడం చాలా ఇబ్బంది అవుతుంది.                                    

వి.లింగయ్య, స్థానికుడు

మరిన్ని వార్తలు