200 కోట్లతో ధర్మపురి ఆలయాభివృద్ధి

08-09-2026 | 05:10am
  1. మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం
  2. డిప్యూటీ సీఎం భట్టి 
  3. మంత్రి అడ్లూరితో కలిసి భూమిపూజ 

జగిత్యాల/ధర్మపురి, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): దక్షిణ కాశీగా, పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన భవిష్యత్తు సరికొత్త శోభను సంతరించుకోనుంది. దశాబ్దాలుగా భక్తులు, స్థానికులు కోరుకుంటున్న ఆలయాభివృద్ధి కలను నెరవేరుస్తూ ప్రభుత్వం 200 కోట్లతో అభివృద్ధి చేసేందుకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం చొరవతో ప్రసిద్ధ ధర్మపురి పుణ్యక్షేత్రం రూ. 200 కోట్ల వ్యయంతో దివ్య ఆధ్యాత్మిక కేంత్రంగా మారబోతుండటం పట్ల భక్తులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 2:58 గంటలకు వేద పండితులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో రూ.10 కోట్లతో చేపట్టిన ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka), మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) భూమిపూజ చేశారు.

ఆ తర్వాత ఆలయంలోని ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి, యోగానంద లక్ష్మీనరసింహస్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘మనందరికీ ఇష్టదైవమైన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాభివృద్ధిపై గతంలో చాలామంది మాటలు చెప్పారే తప్ప అర్ధరూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ప్రజా ప్రభుత్వం స్వామివారి దివ్యానుగ్రహంతో, ప్రజల ఆశీస్సులతో రూ.117 కో ట్లను ముందే మంజూరు చేసింది.

స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం అదనంగా నిధులు కోరగా సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు మరో రూ.80 కోట్లను మ ంజూరు చేశాం. మొత్తంగా రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ధర్మపురి క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టాం’ అని పేర్కొన్నారు. అదేవిధంగా బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. గోదావరి పుష్కరాల్లో భాగంగా గోదావరి నది ప్రవాహం వెంట ఉన్న ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.

కాగా రూ.10 కోట్లతో ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణం, రూ. 58.55 కోట్లతో మొత్తం 9 రకాల మౌలిక వసతులు, ఆలయాభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 22.16 కోట్లతో పవిత్ర గోదావరి పుష్కరాల నిమిత్తం నూతన పుష్కర ఘా ట్ల నిర్మాణం, రూ. 2.48 కోట్లతో ధర్మపురి మండలం తిమ్మపూర్ వద్ద నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

మరిన్ని వార్తలు