ఆ శాఖలోనే ‘ఆమె’కు రక్షణేదీ..?
- మహిళా శాఖలోనే ఓ మహిళకు తప్పని మనోవేదన
- అండగా ఉండాల్సిన అధికారులతోనే వేధింపులు, చీత్కారాలు!
- చీరకట్టులో సూపర్ అంటూ ఓ అధికారి ’హాట్’ కామెంట్స్..
- రాత్రి సమయంలో ఫోన్ చేసి.. నేను చెప్పింది చేస్తే నీకు మంచి స్థానం అంటూ సదరు అధికారి డైలాగ్స్
- ఉన్నతాధికారికి విన్నవించినా.. శోకించినా ఫలితం శూన్యం!
- నెలల వ్యవధిలోనే సదరు మహిళకు మూడు మెమోలు?
- ఉన్నతాధికారి సైతం వ్యక్తిగత విషయాల ప్రస్తావన
- తన బాధను సన్నిహితురాలు వద్ద వెల్లిబుచ్చిన మహిళ
- పేద కుటుంబం కావడంతో మనోవేదనను అనుభవిస్తూనే విధులకు హాజరు
సూర్యాపేట నిఘావిభాగం, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): మహిళా సంక్షేమానికి, వారి భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలు, సేవలకు రూపకల్పన చేసి అమల్లోకి తీసుకువచ్చింది. అయితే దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించలేదు అన్న చందంగా వాటిని అమలు పరచడంలో కొందరు అధికారుల నిర్లక్ష్యం, స్వార్థపూరిత ఆలోచనలతో వాటి అమలులో కొన్ని ఆటంకాలు ఎదురవుతుండడం గమనార్హం.
ముఖ్యంగా వారి రక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి శాఖలోనే అధికారుల తీరు ఇబ్బందికరంగా మారడంతో చాలా చోట్ల మహిళలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సరిగ్గా ఇటువంటి ఘటనే సూర్యాపేట జిల్లా(Suryapet District) కేంద్రంలో ప్రస్తుతం జరుగుతున్నట్టు తెలుస్తుంది.
‘ఆమె’కు రక్షణ కరువు!
మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సినటువంటి జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న ఓ కిందిస్థాయి ఉద్యోగినికి ఆ కార్యాలయంలో రక్షణ కరువైనట్లు సమాచారం. ఆమె ఆ బాధ్యతలలో చేరి సంవత్స రం గడవగా నాటి నుంచే అందులో పనిచేస్తున్న పై స్థాయి అధికారులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్రంగా వేధిస్తున్నారనే విషయాలు బయట వినిపిస్తున్నాయి.
పనిచేయాలంటూ ఒత్తిడి :
ఆమె కుటుంబంలో జరిగిన ఓ విషాద ఘటన ఆధారంగా ప్రభుత్వం ఆమెకు చిన్న వయస్సులోనే ఉద్యోగం ఇచ్చి ఈ కార్యాలయానికి కేటాయించారు. దీంతో ఆమె అక్కడకు విధులకు హాజరయ్యే నాటి నుండి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తుంది. ఆమెను ఒకే పనికి కాకుండా ఆ కార్యాలయంలో మిళితమైన మూడు ఇతర కార్యాలయాలకు సంబంధించిన పనులు అన్ని ఆమెతోనే చేయిస్తున్నట్లు వినికిడి. వాస్తవికంగా ఆ పనులు చేసేందుకు కార్యాలయానికి ఇద్దరు కింది స్థాయి ఉద్యోగులు కేటాయించగా ప్రస్తుతం అక్కడ ఒక్కరే ఉండడంతో పనులన్నీ ఆమెతోనే చేయిస్తున్నట్లు సమాచారం.
ఆమె జాబ్ చార్ట్ లేని పనులు కూడా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగే కార్యాలయాలు ఊడ్చేందుకు స్వీపర్ ఉండగా ఆమె సమయానికి రానప్పటికీ ఏమీ అనకుండా ఈమెతోనే ఆ పనులు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. చివరికి కార్యాలయంలో భోజ నం చేసిన తదుపరి కొందరు తిన్న ప్లేట్ ల ను సైతం ఈమెతోనే కడిగిస్తున్నట్లు అది చూసిన ఇతర శాఖల వారు చర్చించుకుంటున్నట్లు వినికిడి.
ఆయనదే ’కీ’ రోల్!
వాస్తవికంగా ఆ కార్యాలయంలో ఉన్నతాధికారి కంటే ఆయన తదుపరి అధికారి కార్యాలయాన్ని తమ ఇష్టానుసారంగా నడుపుతున్నారనే వార్తలు బయట వినిపిస్తున్నాయి. వాస్తవికంగా ఆ కార్యాలయంలో ఏ పనులు జరగాలన్న ఆయనది కీరోల్ అంటూ కార్యాలయంతో సంబంధించిన చాలామంది ఉద్యోగులు చెబుతుండడం గమనా ర్హం. అయితే సదరు ఉద్యోగి కార్యాలయంలో పనిచేస్తున్న అందరిని (కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్) తన చేతుల్లో ఉంచుకొని ఏది కావాలంటే అది చేయిస్తున్నట్లు సమాచారం. వీరందరినీ ఓ జట్టుగా చేసి తన మాటను వినని ఇతరులపై వారితో ఒత్తిడి చేస్తాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
నచ్చినట్టు చేయాల్సిందే..? :
కార్యాలయంలో ఎవరైనా తనకు నచ్చినట్టు పని చేయాల్సిందేనని సదరు అధికారి చెబుతాడని ఆ కార్యాలయంతో సంబంధం ఉన్న పలువురు అధికారులు తమ సన్నిహితులతో చెబుతుండడం గమనార్హం. వాస్తవికంగా ఆ కార్యాలయంలో కాగితం కదలాలన్నా.. ఫైలు జరగాలన్న.. ఏ పని కావాలన్నా ఆయన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందనేది ఆ కార్యాలయంలో పనిచేస్తున్న పలువురి ద్వారా తెలుస్తున్న విషయం.
అదీ ఆయన అసలు నైజం!
సదరు అధికారి వయస్సు 50 ఏళ్లు దాటినప్పటికీ కార్యాలయంలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగిని చిన్న వయసులోనే ఉద్యో గం వచ్చిందని నేను చెప్పినట్లు నడుచుకుంటే నిన్ను మంచి స్థానంలో ఉంచుతా నంటూ ఆమెతో అనడంతో ఆమె తమ సన్నిహితురాలకు చెప్పి తన బాధను వెళ్ళబో సుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సదరు అధికారి అంతటితో ఆగకుండా కార్యాలయ సమయం ముగిసిన తర్వాత ఆమెకు పదే, పదే ఫోన్ చేసి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతున్నాడని సైతం తన సన్నిహితురాలతో చెప్పినట్లు తెలిసింది.
ఇది చాలదన్నట్టు కార్యాలయానికి చీరకట్టుతో వస్తే.. నీ చీర కట్టు సూపర్ అంటూ హాట్ కామెంట్ చేశాడంటూ తన గోడును వెళ్ళబోసుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావి స్తూ తన మనసులో ఉన్న మాటను సైతం చెప్పి ఆమెను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నట్లు ఒకరిద్దరికి తన బాధను వెల్లబో సుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఉన్నతాధికారికి విన్నవించినా ఫలితం శూన్యం !
కార్యాలయంలో ఆ అధికారి చేస్తున్న చే ష్టల గురించి ఆ కార్యాలయ ఉన్నతాధికారికి పదుల సార్లు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందనే వేదనను ఆమె వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సదరు అధికారి తీరు బాలేదని ఆ ఉన్నత అధికారికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పిన.. ఆయన పెడచెవిన పెడుతున్నాడని సదరు మహిళ మరో మహిళతో చెప్పినట్టు వినికిడి. అంతేకాకుండా ఉన్నతాధికారి సైతం కార్యాలయంలో పనిచేస్తున్న ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావిస్తున్నారనే విషయాలు బయటకు పొక్కుతున్నాయి. దీంతో ఆమె ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కాక సంవత్సర కాలంగా తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నట్టు తెలుస్తుంది.
మూడు మెమోలు జారీ? :
కార్యాలయంలో కీ రోలు ప్రదర్శిస్తున్న ఉద్యోగి సదరు మహిళ తాను చెప్పినట్లు చేయడం లేదని అక్కసుతో సమయానికి విధులు హాజరు కావడం లేదని, చెప్పిన పనులు సక్రమంగా చేయడం లేదని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నావనే కారణాలతో ఇప్పటికే మూడు మెమోలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే కార్యాలయంలో జట్టుగా పనిచేస్తున్న వారిలో ఒకేసా రి ఇద్దరు, ముగ్గురు తో వేర్వేరు పనులు చెప్పించి నీవు ఒకరి పని మాత్రమే చేస్తున్నావ్ ఇతర పనులు ఎవరు చేయాలని బెదిరిస్తున్నట్లు సమాచారం.
మూడోసారి ఇచ్చిన మెమోలో సమయపాలన పాటించలేదని ఇవ్వగా సదరు మహిళ సకాలంలోనే ఎఫ్‌ఆర్‌ఎస్ వేశానని, అయినా కక్ష కట్టి తనను వేధిస్తున్నారని.. నేను హాజరు వేసిన సమయాన్ని మెమోలో వేసిన సమయాన్ని పోల్చి చూడమని గట్టిగా చెప్పడంతో.. అది అర్థం చేసుకున్న ఉన్నతాధికారి మెమోను చించేసినట్లు విశ్వసనీయ సమాచారం.
తదుపరి కార్యాలయంలో నోటీసును చూపుతూ వివరణ రాయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సదరు మహిళ జిల్లా భాస్ కు విషయం చెప్పే ప్రయత్నం చేస్తుందని తెలుసుకున్న కార్యాలయంలోని ఉద్యోగి ఆయన కూడా నన్నేం చేయలేడని, నువ్వు ఎక్కడికి వెళ్లినా తిరిగి నా వద్దకే రావాల్సి ఉంటుందని, నిన్ను ఖచ్చితంగా ఉన్నతాధికారికి చెప్పి సస్పెండ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడీనట్లు సమాచారం.
ఇంత జరిగినా సదరు మహిళది పేద దళిత కుటుంబం కావడంతో అన్ని ఓర్చుకుంటూ విధులు నిర్వహిస్తున్నానని తన సన్నిహితులకు చెబుతున్నట్లు తెలిసింది. మహిళలకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి తోడ్పడే శాఖలోని పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇతర కార్యాలయాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోనని విషయం తెలిసిన పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారి స్పందించి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
