పురాతన చేతిరాతల డిజిటలైజేషన్‌కు చర్యలు
వనపర్తి టౌన్: జిల్లాలోని ఆధ్యాత్మిక, ఆయుర్వేద, ప్రాచీన చరిత్రకు సంబంధించిన పురాతన చేతిరాతలు, వారసత్వ గ్రంథాలను సేకరించి డిజిటలైజేషన్(digitization ) చేసేందుకు జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఎన్. ఖీమ్యా నాయక్(Additional Collector. Kheemya Nayak) అధ్యక్షతన శుక్రవారం ఆయన చాంబర్‌లో కమిటీ తొలి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ఇళ్లలో, దేవాలయాలు, మఠాలు, దర్గాల్లో భద్రపరిచిన పురాతన చేతిరాతలు, ఆయుర్వేద గ్రంథాలను గుర్తించి డిజిటలైజేషన్ చేసిన అనంతరం తిరిగి అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాళ్లను కమిటీ సభ్యులుగా తీసుకుని విద్యార్థుల ద్వారా పురాతన గ్రంథాలు, చేతిరాతల వివరాలను సేకరించి నిర్ణీత ప్రొఫార్మాలో నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నరేందర్‌కుమార్, ఎఫ్ సెక్షన్ సూపరింటెండెంట్ సునీత, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.