గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై సూచనలు చేసిన జిల్లా ఎస్పీ డి.జానకి
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి – నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
జడ్చర్ల, సెప్టెంబర్ 22: జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డి.జానకి ఐపీఎస్(District SP Janaki IPS) సందర్శించి పోలీస్ స్టేషన్ పనితీరు, శాంతిభద్రతలు, నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు.
గతంలో ఇచ్చిన సూచనల అమలు పరిస్థితిని కూడా పరిశీలించారు.పెండింగ్ కేసులను ప్రాధాన్యత క్రమంలో తీసుకొని దర్యాప్తును వేగవంతం చేయాలని, సాక్ష్యాధారాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల గుర్తింపు, చార్జ్‌షీట్ దాఖలు తదితర ప్రక్రియలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఎస్పీ ఆదేశించారు. పిటిషన్లపై కూడా సత్వర విచారణ జరిపి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సూచించారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా పటిష్ట బందోబస్తు
వినాయక నిమజ్జనం సందర్భంగా జడ్చర్ల పట్టణంలో శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిమజ్జన కార్యక్రమం జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. నిమజ్జన శోభాయాత్ర రూట్లను ముందుగానే పరిశీలించి, కీలక కూడళ్లలో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేయాలని సూచించారు.
గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుని శోభాయాత్రలు క్రమబద్ధంగా సాగేలా చూడాలని, నిమజ్జన ప్రదేశాల్లో తగిన భద్రతా చర్యలు, లైటింగ్, బారికేడింగ్, క్రేన్ తదితర ఏర్పాట్లను ముందుగానే పరిశీలించాలని ఆదేశించారు. అనుమతి లేని డీజేలు, అధిక శబ్దం, ప్రమాదకరమైన విద్యుత్ వైరింగ్ మరియు నిబంధనలకు విరుద్ధమైన చర్యలకు తావులేకుండా పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు.
జడ్చర్ల పట్టణ పరిధిలో నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి బీట్ పెట్రోలింగ్, రాత్రి గస్తీ, వాహన తనిఖీలు పెంచాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.
మహిళలు, బాలలు, వృద్ధుల ఫిర్యాదులపై సున్నితంగా స్పందించాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. సీసీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి 1930 హెల్ప్‌లైన్పై ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.
ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ మాట్లాడుతూ, “ప్రజల భద్రత, నేర నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం అందించడం పోలీసుల ప్రధాన బాధ్యత. ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలి” అని సూచించారు. ఈ సందర్శనలో జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగినది.