ద్వంద్వ వైఖరి
- గెలిచినప్పుడు ఈసీని పొగిడి, ఓడితే నిందలా?
- కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపాటు
- రాజ్యాంగ వ్యవస్థలనే అపహాస్యం చేస్తారా?
- ఓట్ల చోరీ బీజేపీ చేయదు
- ప్రజల నమ్మకాన్ని, మనసులను గెలిచి అధికారంలోకి..
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ‘మిస్టర్ రాహుల్ గాంధీ.. బీజేపీ(BJP) ఎన్నడూ ఓట్లను చోరీ చేయదు, దేశ ప్రజ ల మనసులను గెలుచుకుంటుంది. ఎన్నికల్లో గెలిస్తే తమ ఘనతగా చెప్పుకోవడం, ఓడిపోతే ఈవీఎంలు, ఎన్నికల సం ఘంపై నిందలు వేయడం కాంగ్రెస్ దిగజారుడు(Congress's decline) రాజకీయాలకు, ద్వంద్వ వైఖరికి నిదర్శనం’ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజలు ఛీత్కరించుకుంటున్నా కాంగ్రెస్ వైఖరిలో మార్పు రావ డం లేదని మండిపడ్డారు.
ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం, రాజ్యాంగ వ్యవస్థలపై రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ‘కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కేరళం, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ ఎన్నికల సంఘం చాలా బాగా పనిచేసినట్టా?, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడింది కాబట్టి సరిగ్గా పనిచేయనట్టా’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నిం చారు.
అదే ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే మాత్రం ఈవీఎంలు, ఎన్నికల సంఘం తప్పన్నట్లు మాట్లాడటం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ది కాదని, రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత ఈవీఎంలది కాదని స్పష్టం చేశారు.
గాంధీ కుటుంబ సేవలో సీఎం..
రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు ఏమాత్రం లేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించి, పత్రికా స్వేచ్ఛను హరించి, పౌర హక్కులను కాలరాసి, ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెట్టి చీకటి రాజ్యాన్ని నడిపిన చరిత్ర కాంగ్రెస్‌దని నిలదీశారు. 2009లో తమ మాట వినడం లేదని ఏకంగా రాజ్యాంగబద్ధ ఎన్నికల కమిషనర్లను తొలగించాలని రాష్ట్రపతికి సిఫారసు చేసిన చరిత్రను గుర్తుచేశారు.
ప్రస్తుతం తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేయాలన్నా కోర్టులకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, అలాంటి వారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు వెళ్లి ‘సోనియా గాంధీ కుటుంబం కోసం ప్రాణాలు అర్పిస్తా’ అనడం సిగ్గుచేటని, ప్రజల సమస్యలను గాలికొదిలేసి గాంధీ కుటుంబ సేవలోనే గడుపుతున్నారని ఆక్షేపించారు.
దేశ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు..
‘రాహుల్ గాంధీ ఏ ఒక్క వ్యవస్థనూ వదిలిపెట్టడం లేదు. ఆర్మీ చీఫ్, ఎయిర్‌ఫోర్స్, సర్జికల్ స్ట్రైక్స్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, లోక్‌సభ స్పీకర్, సీజేఐ, ఈడీ, సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, మీడియా హౌస్‌లతో పాటు చివరకు పార్లమెంట్, జీఎస్టీ వ్యవస్థలపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ విషప్రచారం చేస్తున్నారు. విదేశీ వేదికల మీద దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడటం ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనం‘ అని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
‘ఈ దేశాన్ని మా కుటుంబం మాత్రమే పాలించాలి, తమ తాత, నానమ్మ, తండ్రి ప్రధానులయ్యారు కాబట్టి నేనే ప్రధాని కావాలనే రాచరికపు భావజాలం, అహంకారం రాహుల్ గాంధీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. గత 11- ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని, గత యూపీఏ పాలన అంతా కుంభకోణాల మయంగా సాగిందని ఎద్దేవా చేశారు. స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టే బీజేపీని పదే పదే ఆశీర్వదిస్తున్నారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు..
ఉత్తరప్రదేశ్‌లో 1989 నుంచి, బీహార్‌లో 1990 నుంచి, పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి, గుజరాత్లో 1998 నుంచి, ఏపీలో 2009 నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అడ్రస్సే లేకుండా చేశారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం సృష్టించి, చివరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
‘సర్’ను స్వాగతించకుండా ఆరోపణలా?
పశ్చిమబంగాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు, పర్యవేక్షణలోనే లక్షలాది అక్రమ ఓట్లను తొలగించడం జరుగుతుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దితే స్వాగతించాల్సింది పోయి రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం తగదన్నారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లు స్వయంగా సమావేశమై తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టత ఇచ్చారని, దీనిపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం దారుణమన్నారు. కేరళ, తమిళనాడులో గెలిచినప్పుడు సర్ ప్రక్రియ మంచిదన్న కాంగ్రెస్.. బంగాల్, ఇతర రాష్ట్రాల్లో తప్పు పట్టడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
గణేష్ ఉత్సవ కమిటీ, అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు..
హైదరాబాద్‌లో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో, విజయవంతంగా ముగిసినందుకు కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి, పోలీస్, మున్సిపల్ సిబ్బందికి, ప్రభుత్వ యంత్రాంగానికి, సహకరించిన నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.