4 September, 2026 | 4:54 AM

సంక్షోభంలోకి విద్యారంగం

04-09-2026 | 03:40am
  1. ఏబీవీపీ జాతీయ సహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ 
  2. ఫీజు బకాయిలు చెల్లించాలని ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ఫీజు దీక్ష 

ముషీరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ (ABVP Telangana State Branch) ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద గురువారం ‘ఫీజు దీక్ష’ (Fee initiation) నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ సహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో విద్యారంగం సంక్షోభంలోకి వెళ్లిందని ఆరోపించారు. ఏళ్లుగా స్కాలర్షిప్స్ విడుదల కాక విద్యాసంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు.

ఏబీవీపీ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి చిరిగి శివకుమార్ మాట్లాడుతూ.. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ను ఆర్థిక భారంగా చూడకుండా విద్యార్థుల హక్కుగా భావించి బకాయిలను విడుదల చేయాలని కోరారు.

ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై ఆధారపడి చదువుతున్నారని, ప్రభుత్వం బకాయిలను సకాలంలో విడుదల చేయకపోవడంతో సుమారు రూ.11 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని పేర్కొన్నారు.

వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ సిటీ సెక్రెటరీ పృథ్వీతేజ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రాజు, శ్యామ్, మహేష్, దీపిక, ఛత్రపతి, ఎన్‌ఈసీ సభ్యులు జీవన్, హర్షవర్ధన్, లక్ష్మణ్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.