4 September, 2026 | 4:40 AM

జీవో ఉపసంహరించాలి..

04-09-2026 | 03:35am
  1. ధర్నాచౌక్‌లో విద్యార్థులతో కలిసి సీజేపీ భారీ ధర్నా
  2. ఫోన్‌లో మాట్లాడి మద్దతు ప్రకటించిన దీప్కే
  3. విద్యార్థులతో ప్రభుత్వం చర్చించాలని డిమాండ్

ముషీరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): పాలిటెక్నిక్ విద్యార్థుల విద్య, ఉపాధి, భవిష్యత్తును పరిరక్షించడంతో పాటు జీఓ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో వందలాదిమంది విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనకు ‘కాక్రాచ్ జనతా పార్టీ (సీజేపీ) తెలంగాణ’ (Cockroach Janata Party (CJP) Telangana) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా నిరసనలో పాల్గొన్న విద్యార్థులతో సీజేపీ జాతీయ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వీడియో కాల్‌లో మాట్లాడి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే, వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయకపోతే తెలంగాణకు స్వయంగా వచ్చి వారితోపాటే పోరాడతానని చెప్పారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండించారు. ఈ సందర్భంగా సీజేపీ దక్షిణాది ప్రాంత నాయకుడు విజయ్ రెడ్డి మల్లంగి మాట్లాడుతూ.. విద్యార్థులు ఐక్యంగా, శాంతియుతంగా పోరాడితే ఏ ప్రభుత్వాలైనా వారి డిమాండ్లను వినాల్సిందేనని, తీర్చాల్సిందేనని అన్నారు.

ఆయా డిమాండ్లపై తమతో తెలంగాణ ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీల్లో విద్యార్థుల ప్రతినిధులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీజేపీకి చెందిన స్టాన్లీ కొరాని, కొండ గర్రీ మాథ్యూస్, రంగసాయి రెడ్డి, నివాస్, అశోక్, రాజేష్ కొరపాక పాల్గొన్నారు.