విద్యుత్ సమస్యలపై సబ్‌స్టేషన్ ముట్టడి
- కారముంగి నుంచి కరస్‌గుత్తి వరకు భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన
- శాంక్షన్ చేసిన రోడ్లను పూర్తి చేయలేకపోతున్నారని కాంగ్రెస్‌పై విమర్శ
- ఇది ప్రజల ప్రభుత్వం కాదు.. కమిషన్ల ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నాగల్‌గిద్ద, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): నాగల్‌గిద్ద మండలంలోని గ్రామీణ రహదారులు(Rural Roads) అధ్వానంగా మారాయని, వాటిని వెంటనే నిర్మించడంతో పాటు రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చి ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి(Former MLA Mahareddy Bhupal Reddy) ఆధ్వర్యంలో మంగళవారం పాదయాత్ర, ధర్నా నిర్వహించారు.
కారముంగి నుంచి కరస్‌గుత్తి వరకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలతో కలిసి పాదయాత్ర చేపట్టి రోడ్ల పరిస్థితిపై నిరసన వ్యక్తం చేశారు.అనంతరం రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. వ్యవసాయానికి సరైన సమయంలో విద్యుత్ అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించి పంటలను కాపాడాలని అధికారులను కోరారు.
ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజల అవసరాలను గుర్తించి నారాయణఖేడ్ నుంచి డబుల్‌లైన్ రోడ్డు ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గంలో అనేక రోడ్లను శాంక్షన్ చేయించానని తెలిపారు. నాగల్‌గిద్ద మండలంలో నాలుగు కొత్త చెరువులను కూడా మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. గతంలో తాను శాంక్షన్ చేయించిన రోడ్లను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయలేకపోతోందని ఆరోపించారు.
కనీసం ప్రస్తుతం ఉన్న రోడ్లపై గుంతలను కూడా పూడ్చలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని భూపాల్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు రోడ్లతో ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. “ఇది ప్రజల ప్రభుత్వం కాదు..
కమిషన్ల ప్రభుత్వం” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.రైతులకు సరైన విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న రైతులకు అవసరమైన సమయంలో కరెంటు అందకపోతే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెప్పిన ప్రభుత్వం రైతులను సబ్‌స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితికి తీసుకొచ్చిందని ఆరోపించారు.
రోడ్ల దుస్థితితో సంబంధాలకూ ఇబ్బందులు: సర్పంచ్ రవికుమార్ పాటిల్ ఈ సందర్భంగా కారముంగి సర్పంచ్ రవికుమార్ పాటిల్ మాట్లాడుతూ గ్రామానికి వెళ్లే రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు అధ్వానంగా ఉండటంతో గ్రామస్తులు నిత్యం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
“రోడ్ల పరిస్థితి కారణంగా మా గ్రామానికి పిల్లనివ్వడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం రవాణా సమస్యగానే కాకుండా గ్రామస్తుల సామాజిక జీవితంపైనా ప్రభావం చూపుతోందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామానికి నాణ్యమైన రోడ్లు నిర్మించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని రవికుమార్ పాటిల్ కోరారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని భూపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. శాంక్షన్ అయిన రోడ్లను త్వరగా పూర్తి చేయడంతో పాటు గుంతలను పూడ్చాలని, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ప్రజల తరఫున మరింత ఉధృతంగా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పండరి, ప్రధాన కార్యదర్శి సంజీవ్ కుమార్, కారముంగి సర్పంచ్ రవికుమార్ పాటిల్, కరస్‌గుత్తి మాజీ సర్పంచ్ అశోక్‌రావు పాటిల్, ఎస్గి సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి, ఔదాత్ పూర్ మాజీ సర్పంచ్ రాజకుమార్,శ్రీధర్‌రావు పాటిల్, గుణవంత్ పాటిల్, సద్దాం, రఫీ, వెంకట్ నాయక్, సూర్యప్రకాశ్ రెడ్డి, సంతోష్ పాటిల్,
సుభాష్‌రావు పాటిల్, దత్తు యాదవ్, విఠల్‌రావు పాటిల్,రాజు పాటిల్, కోటె నాగ్శెట్టితో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.