నిర్లక్ష్యం ఎవరిది..?

30-09-2026 | 05:25am
  1. గడువు ముగిసిన మందులను దగ్ధం చేసిన సిబ్బంది
  2. గ్రామాన్ని చుట్టేసిన దట్టమైన పొగ
  3. దుర్వాసనతో ప్రజల ఇబ్బందులు

బెజ్జూర్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల(Bejjur Mandal) కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం(Community Health Center) ప్రాంగణంలో సోమవారం రాత్రి గడువు ముగిసిన మందులను(Expired medications) పెద్ద ఎత్తున దగ్ధం చేయడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. మందులు కాల్చడంతో దట్టమైన పొగ, తీవ్ర దుర్వాసన వ్యాపించి ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు. మందుల గడువు తేదీలను ఎప్పటికప్పుడు పరిశీలించకపోవడం వల్లే పెద్ద మొత్తంలో మందులు గడువు ముగిసే పరిస్థితి వచ్చిందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన మోతాదులో మందులు అందడం లేదని, రక్తహీనతతో వచ్చే నిరుపేద గర్భిణీలకు ఐరన్ ఇంజక్షన్లు(Iron injections) కూడా అందడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో వైద్య సేవలపై ప్రభావం పడుతోందని మండల ప్రజలు అంటున్నారు.గతంలో నెలకు సుమారు 50 వరకు సుఖప్రసవాలు జరిగేవని, ప్రస్తుతం 10 నుంచి 12 వరకు మాత్రమే జరుగుతున్నాయని వారు పేర్కొంటున్నారు. ఆసుపత్రికి వచ్చే కొన్ని కేసులను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ప్రసవాలకు సంబంధించిన రికార్డుల నమోదుపైనా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు బెజ్జూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంపై ప్రత్యేక దృష్టి సారించి వైద్య సేవలను మెరుగుపరచాలని, ప్రభుత్వ మందులు వృథా కాకుండా గడువు తేదీలను పర్యవేక్షించాలని  ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు