అటవీశాఖ అధికారుల నుండి రైతులకు రక్షణ కల్పించాలి
సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు
కొమరం భీం ఆసిఫాబాద్: జిల్లాలో అటవీ శాఖ అధికారుల(Forest department officials) ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని, దీంతో రైతులకు. రక్షణ కరువైందని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు(MLA Dr. Palvai Harish Babu) ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం శాసనసభలో మాట్లాడుతూ కాగజ్నగర్ డివిజన్ అటవీ ప్రాంతం కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్(Kawal Tiger Reserve Zone) లో ఉందని తెలిపారు. దీంతో సిర్పూర్ నియోజకవర్గం లో అభివృద్ధి పనులు చేయడానికి అటవీ శాఖ అధికారులు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు.
రోడ్లు లేక చాలా గిరిజన గ్రామాల ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అటవీశాఖ అధికారులు రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న పట్టా భూములను సైతం అడ్డుకొని రైతులను ఇబ్బందుల గురి చేస్తున్నారని సభలో ఆవేదన వ్యక్తపరిచారు. గతంలో అటవీ సమీప ప్రాంతాల రైతుల సమస్యలపై అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, మంత్రి కి సైతం రైతుల సమస్యను పరిష్కరించాలని విన్నవించినప్పటికీ అటవీ శాఖ అధికారుల నుండి ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొన్నారు.
సిర్పూర్ నియోజకవర్గం లో గతంలో 4 గురు రైతులు పులి దాడులో మృతి చెందారని, వారి కుటుంబీకులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ న్యాయం చేయలేదని అన్నారు. సిర్పూర్ నియోజవర్గంలో అడవులు అధికంగా ఉన్నాయని, ముఖ్యంగా మహారాష్ట్రను ఆనుకొని ఉండడం వల్ల తడోబా అటవీ ప్రాంతం నుంచి పురుల సంచారం అధికంగా ఉందని అన్నారు. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లి రైతులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. అలాగే గొర్రెల కాపరులను గొర్రెలను మేత కోసం అడవుల్లోకి వెళ్ళనీయకుండా అధికారులు అడ్డుపడడం, ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు?.. మహారాష్ట్రలో ఇలాంటి నిబంధన ఏది లేదని..? మరి కేవలం తెలంగాణలో గల అటవీశాఖ అధికారులకే ఈ అధికారాలు ఉన్నాయా.. అని అడిగారు.