కాంగ్రెస్ కరెంట్ కోతలపై రైతుల కన్నెర్ర
కందుకూరులో సబ్‌స్టేషన్ ముట్టడి
రైతులకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి/వేంసూరు,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా(Khammam District) సత్తుపల్లి నియోజకవర్గం, వేంసూరు మండలం కందుకూరులో విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. కందుకూరు, దిద్దుపూడి, భరణిపాడు, లచ్చన్నగూడెం గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన ర్యాలీ నిర్వహించి సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఏడు గంటల విద్యుత్‌ను కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల ఆందోళనకు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (Former MLA Sandra Venkata Veeraiah) సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడితే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ సవాల్‌గా తీసుకుని, తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందించారని అన్నారు. వ్యవసాయాన్ని దండగ నుంచి పండగగా మార్చి రైతులకు భరోసా కల్పించిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.
మళ్లీ కరెంట్ కోతలు ఎందుకు?
రాష్ట్రంలో మళ్లీ విద్యుత్ కోతలు ఎందుకు విధిస్తున్నారని సండ్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల విద్యుత్ అవసరాలపై ముందస్తు ప్రణాళిక లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసైనా రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
ఎరువుల కోసం రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ఎరువుల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని సండ్ర ఆరోపించారు. యాప్ ద్వారా ఎరువుల పంపిణీ పేరుతో రైతులకు ఇబ్బందులు సృష్టించడం సరికాదన్నారు. చాలామంది రైతుల వద్ద స్మార్ట్‌ఫోన్లు లేవని, గతంలో మాదిరిగానే కూపన్ల విధానంలో ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎరువుల కొరతను ముందుగానే గుర్తించి సరిపడా నిల్వలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వరంగల్ రైతు డిక్లరేషన్‌లో అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు కొన్ని పంటలకే పరిమితం చేయడం రైతులను మోసం చేయడమేనని సండ్ర విమర్శించారు. రైతు కూలీలకు అండగా ఉంటామని, రైతు భరోసా పెంచుతామని ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతులను ఇబ్బందుల్లోకి నెట్టకుండా, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రచారం సరికాదు
కేసీఆర్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి భారీగా నిధులు వెచ్చించి పనులను ముందుకు తీసుకెళ్తే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం స్వల్ప నిధులతో చేపట్టిన పనులకు మొత్తం ప్రాజెక్టు ఘనతను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని సండ్ర విమర్శించారు. రైతులకు కోతలు లేని విద్యుత్ అందించి పంటలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. సండ్ర వెంకట వీరయ్య సబ్‌స్టేషన్‌లోకి వెళ్లి విద్యుత్ సరఫరాకు సంబంధించిన లాగ్‌బుక్‌ను పరిశీలించారు.
లాగ్‌బుక్‌ను చూపించేందుకు అధికారులు తొలుత కొంత నిరాకరించడంతో.. విద్యుత్ సరఫరా పరిస్థితిపై మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనంతరం లాగ్‌బుక్‌ను పరిశీలించిన సండ్ర.. రైతులకు వాస్తవంగా ఎంతసేపు విద్యుత్ సరఫరా అవుతుందో, ఎంతసేపు అంతరాయం ఏర్పడుతుందో వివరాలను పరిశీలించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా తప్పించుకునే ధోరణి విడనాడి.. తక్షణమే కోతలు లేని విద్యుత్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కందుకూరులో రైతులతో ప్రారంభమైన ఈ ఆందోళన ఆరంభం మాత్రమేనని, విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని సండ్ర వెంకట వీరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.