మంథనిలో గణపతి హోమం..పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు
20-09-2026 | 01:54pm
మంథని,సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో లోకకల్యాణార్థం నిర్వహించిన గణపతి హోమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమ క్రతువును శాస్త్రోక్తంగా జరిపించారు. మంత్రి శ్రీధర్ బాబు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని, నియోజకవర్గం, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.