24 March, 2026 | 9:10 PM

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

24-03-2026 07:53 PM

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మంగళవారం కాగజ్‌నగర్ సమీపంలోని సేంద్రీయ, సమీకృత వ్యవసాయ యూనిట్‌ను సందర్శించారు. కళాశాలలోని ఎకో క్లబ్, భౌతిక మరియు రసాయన శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ అమలవుతున్న సాగు పద్ధతులు, పర్యావరణహిత సాంకేతిక విధానాలపై అధ్యయనం చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీదేవి తెలిపారు.

ఈ సందర్భంగా జల్ జీవిక సెంటర్ ఫర్ ఆక్వాటిక్ లైవ్లీహుడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ పద్మాకర్ సేంద్రీయ వ్యవసాయ విధానాల గురించి విద్యార్థులకు వివరించారు. బీడు భూములను సైతం సాగులోకి తీసుకువచ్చి ఎలాంటి రసాయనిక ఎరువులు వినియోగించకుండా పర్యావరణహిత సాగు పద్ధతుల ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చని ఆయన తెలిపారు. సేంద్రియ వ్యవసాయం, సమీకృత వ్యవసాయ పద్ధతులు, సుస్థిర వ్యవసాయం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీదేవి మాట్లాడుతూ రసాయనిక ఎరువుల అధిక వినియోగం వల్ల భూసారం తగ్గి పంటల ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.