12 May, 2026 | 3:22 PM

ఘనంగా హనుమాన్ జయంతి

12-05-2026 02:19 PM

దమ్మపేట,(విజయక్రాంతి): శ్రీ విజయ మహా గణపతి, శ్రీ మర్రి భక్తాంజనేయ స్వామి దేవాలయ మందిరాలల్లో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ స్థానాధిపతి చామర్తి సాయి ప్రసాద్ శాస్త్రి ఆధ్వర్యంలో ఆలయాన్ని సుందరంగా పూల మాలలతో అలకరించి, శ్రీ మఱి భక్తాంజనేయ స్వామి కి మంగళవారం ఉదయం  తమలపాకులు, తామర పుష్పాలు సింధూరంతో అర్చనలు నిర్వహించారు.  ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం "జై శ్రీరామ్.. జై హనుమాన్" అనే నామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమానికి  భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాధిపతి చామర్తి సాయి ప్రసాద్ శాస్త్రి ప్రతి ఒక్కరికి గోత్ర నామ సంకల్ప సహితంగా అర్చన నిర్వహించారు. అర్చన అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ

మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ఉన్న హనుమాన్ మందిరం లో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో విశేష అభిషేకాలు, సింధూర అలంకరణ చేశారు. అనంతరం లోక కల్యాణార్థం భక్తులందరూ కలిసి సామూహికంగా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. హనుమంతుని కృప అందరిపై ఉండాలని, కష్టాలు తొలగి సుఖశాంతులు కలగాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పారాయణ లో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఆలయ కమిటీ భక్తులకు తీర్థప్రసాదాలు  అందచేశారు.