ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు, మహిళ మృతి
రుద్రంగి,(విజయక్రాంతి): హల్దీ వేడుకకు వెళ్తుండగా విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి ప్రమాదంకారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు.. కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఇద్దరికి చికిత్స.. క్షతగాత్రుల్లో చిన్నారి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు కారులో చందుర్తిలో నిర్వహించే హల్దీ వేడుకకు వస్తుండగా లింగంపేట మార్గమధ్యలో కారు అదుపుతప్పి ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఈ తీవ్ర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక దుర్మరణం చెందింది.
కారు ప్రమాదంలో ఒక చిన్నారితో సహా ఐదుగురు గాయపడగా, వారిని వెంటనే స్థానికుల సహాయంతో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అయితే వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వైద్యాధికారుల సూచన మేరకు మెరుగైన అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరు క్షతగాత్రులకు వేములవాడ ఏరియా ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. వేడుకకు వెళ్తుండగా చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో రుద్రంగి, చందుర్తి గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.






