23 August, 2026 | 1:10 AM

‘హైదరాబాద్ నాలెడ్జ్ హబ్’లో భాగస్వాములు కావాలి!

23-08-2026 12:25 AM
  1. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు సీఎం రేవంత్ పిలుపు
  2. లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో భేటీ

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి) : హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే క్రతువులో అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, వర్సిటీ యాజమాన్యాలు భాగస్వాములు కావాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. యూకే రాజధాని లండన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో శనివారం వర్సిటీ ప్రతినిధులు, విద్యా వేత్తలు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రతినిధులతో సీఎం సమాలోచనలు జరిపారు.

తెలంగాణ రైజింగ్ అధికారిక ప్రతినిధి బృందానికి సీఎం నాయకత్వం వహించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీనియర్ ఐఏఎస్ జయేశ్ రంజన్ ప్రపంచస్థాయి విద్యాసంస్థలు, వర్సిటీలకు హైదరా బాద్‌లో ఉన్న అవకాశాలను కేంబ్రిడ్జ్ బృం దానికి వివరించారు.

వర్సిటీ బిజినెస్ స్కూల్ లో భారత ప్రభుత్వం తరఫున సేవలందిస్తున్న ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, ప్రొఫెసర్ వెంకట సెరిష్ గండికోట హైదరాబాద్ నాలెడ్జ్ హబ్‌లో భాగస్వాములయ్యేందుకు ఆసక్తికనబరిచారు. అనంతరం తెలంగాణలో పరిశోధన, వాణిజ్య ఆలోచనలను ప్రోత్సాహించడం, కొత్త స్టార్టప్‌లకు పరస్పర సహా య సహకారాలు అందించుకునేందుకు ఒక సహకార వ్యవస్థ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరస్పరం అంగీకరించాయి.

తర్వాత సీఎంతో లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్ సంస్థ ప్రతినిధు లు సుసాన్ ఫిన్నెగాన్, నూలా గల్లాఘర్‌తోపాటు పలువురు భేటీ అయ్యారు. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థల విషయంలో భాగస్వామి అయ్యేందుకు సంస్థ ప్రతినిధులు ఆసక్తి చూపారు. దీనిలో భాగంగానే సంస్థ బృందం అక్టోబర్‌లో హైదరాబాద్‌ను సందర్శించనుంది. 

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలి:  రామకృష్ణారావు

లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీని తెలంగాణ ఎక్స్‌అఫీషియో ప్రభుత్వ సలహాదారు కే.రామకృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా కాలేజీ అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్, స్ట్రాటజిక్ ఎంగేజ్‌మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అమాండా వోల్తుయిజెన్, దక్షిణాసియా, ఆస్ట్రలేషియా ప్రాంతాల సీనియర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మేనేజర్ రొసాన్నా గిల్లెస్పీతో ఆయన భేటీ అయ్యారు.

విద్యా రంగ అభివృద్ధికి తెలంగాణలో ఉన్న అవకాశాలను రామకృష్ణారావు వివరించారు. తెలం గాణతోపాటు హైదరాబాద్‌లో షార్ట్ టర్మ్ కోర్సులు, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ డ్రైవ్స్ నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని అమాండా తెలిపారు. పరిశోధన రంగంలో భాగస్వామ్యం, విద్యార్థులు, అ ధ్యాపకుల పరస్పర మార్పిడి గురించి కూడా అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు. 

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానం

డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు రావాలని ఆ బృందాన్ని ఆహ్వానించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ (స్టెమ్- ఎస్టీఈ ఎం), వాణిజ్య విద్యా రంగాల్లో ప్రపంచంలోనే టాప్ విద్యాసంస్థగా ఇంపీరియల్ కాలేజీకి పేరుంది. అలాం టి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థతో తెలంగాణ భాగస్వామి అయితే.. రాష్ట్రం విద్యా హబ్‌గా రూపాంతరం చెందుతుంది.