గ్యాస్ ఏజెన్సీల అత్యాశ

30-09-2026 | 05:25am
  1. వంటగ్యాస్ సరఫరాపై ఇష్టారాజ్యం
  2. అక్రమ వసూళ్ల జోరు
  3. నిబంధనలను తుంగలో తొక్కుతున్న వైనం

బిచ్కుంద, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పిట్లం తదితర మండలాల్లో వంట గ్యాస్ సిలిండరు ధరపై(Cooking gas cylinder price) అదనపు వసూళ్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గృహావసరాల గ్యాస్ సిలిండరు ధర(Domestic gas cylinder price) బహిరంగ మార్కెట్కు అనుగుణంగా మారుతోంది. ఒక్కో నెలలో పెరుగుతూ, మరో నెలలో తగ్గుతూ ఉండటం వల్ల వాస్తవ ధర వినియోగదారులకు స్పష్టంగా తెలిసే పరిస్థితి ఉండటం లేదు.

ఇదే ఎక్కువనుకుంటే, సిలిండరు అసలు ధర కంటే ఇంటికి సరపర చేసే  సమయంలో అదనంగా వసూలు చేస్తుండటం వినియోగదారులకు మరింత భారమవుతోంది. ఈ వసూళ్లు చిల్లరగా కనిపించినా, నెలనెలా ఇది లక్షల్లో సాగుతోంది. మండల కేంద్రానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి ఇటీవల గ్యాస్ సిలిండరు మీద అదనపు వసూళ్లపై డెలివరీ బాయ్ను నిలదీశాడు. వెంటనే ఆ వ్యక్తి సిలిండరు ఇవ్వడానికి నిరాకరించాడు. గట్టిగా మాట్లాడితే ఇంటి బయటే సిలిండరు వదిలేశాడు.

చేసేదిలేక విశ్రాంత ఉద్యోగి పూర్తి మొత్తం ఇవ్వాల్సి వచ్చింది. అదే విధంగా న్యూ కాలనీకి చెందిన ఓ గృహ వినియోగదారుడు ఇరవై రోజుల క్రితం గ్యాస్ తెప్పించుకున్నాడు. వాస్తవ సిలిండరు ధర కంటే అదనంగా రూ. 20 వసూలు చేశారు. సదరు గృహ వినియోగదారు ఇంటికి, గ్యాస్ గోదాముకు మధ్య దూరం కేవలం ఒక కిలోమీటరు లోపే. అయినా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

ఎప్పటి నుంచో అక్రమ వసూళ్ల దందా

ఇక్కడ గ్యాస్ సిలిండరు సరఫరా అక్రమ వసూళ్ల దందా ఎప్పటినుంచో సాగుతున్నా, అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒక వైపు బిల్లులపై ఉన్న ధరకు అదనంగా చెల్లించవద్దని ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు ఇంటికి తీసుకొచ్చే ఏజెన్సీ సిబ్బంది మాత్రం రూ.20 నుంచి రూ. 30 వరకూ ప్రాంతాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. నియోజకవర్గకేంద్రంలోనే గాకుండా మండలకేంద్రంలో సైతం సిలిండరుపై రూ.20 నుంచి 30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇంక గ్రామాల్లో అయితే 50 రూపాయలు ఆపైనే వసూళ్లు చేస్తున్నారు. చాలామంది గృహిణులు వాస్తవ మొత్తాన్ని గమనించకుండా అడిగినంతా ఇచ్చేస్తున్నారు.

ఐదు కిలోమీటర్లు దాటితేనే

గ్యాస్ సిలిండర్లకు అదనంగా వసూలు చేయవద్దని ఏజెన్సీలకు చెబుతున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సిలిండరు డెలివరీ పరిధి ఐదు కిలోమీటర్ల లోపు ఉంటే ఉచితమేనని, పైసా కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు. ఐదు నుంచి 30 కిలోమీటర్ల వరకైతే రూ.10 మాత్రమే అదనంగా వసూలు చేస్తారని తెలిపారు. ఏజెన్సీలు, సిబ్బంది వినియోగదారులను ఇబ్బంది పెట్టకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని అధికారులు వివరించారు.

మరిన్ని వార్తలు