ఇందిరమ్మ టవర్స్‌కు నేడే శ్రీకారం

21-09-2026 | 05:05am
  1. రాయదుర్గంలో మంత్రి పొంగులేటి చేతుల మీదుగా శంకుస్థాపన
  2.    2.85 ఎకరాల్లో 480 ఫ్లాట్‌లు
  3. నేటి నుంచే అలాట్‌మెంట్ లెటర్లు   

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి) : నగరంలో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు మరో అవకాశం అందుబాటులోకి రానుంది. రాయదుర్గం(Raidurgam)లోని మల్కం చెరువు వెనుక భాగంలో ఉన్న హౌసింగ్ బోర్డు స్థలంలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి సోమవారం ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇండ్ల నిర్మాణానికి హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 2.85 ఎకరాల్లో 480 ఫ్లాట్ల నిర్మాణానికి అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

కాగా ఇందిరమ్మ టవర్స్(Indiramma Towers) కోసం వినియోగిస్తున్న భూమి విలువ సుమారు రూ.752 కోట్ల నుంచి రూ.767 కోట్ల వరకు ఉంటుంది. ఇటీవల ఈ ప్రాంతంలో జరిగిన భూలావాదేవీలను పరిశీలిస్తే ఎకరం ధర వందల కోట్లకు చేరిన విషయం స్పష్టమవుతోంది. 5.25 ఎకరాల భూమి ఎకరానికి రూ.264 కోట్ల చొప్పున సుమారు రూ.1,386 కోట్లకు, మరో 5.38 ఎకరాల భూమి ఎకరానికి రూ.269 కోట్ల చొప్పున సుమారు రూ.1,447 కోట్లకు ప్రభుత్వం విక్రయించింది. ఇంత ఖరీదైన ప్రాంతంలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఇండ్లు నిర్మిస్తుండటం ప్రాజెక్టులో  కీలకంగా మారింది.    

లబ్ధిదారుడి వాటా కేవలం రూ. 6లక్షలే

ఇందిరమ్మ టవర్లలో ఒక్కో ఫ్లాట్ సుమారు 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుంది. ఒక్కో ఫ్లాట్‌కు ప్రభుత్వం రూ.5లక్షల సబ్సిడీ అందించడంతో పాటు భూమి పూర్తి వ్యయాన్ని భరించనుంది. లబ్ధిదారు తన వాటాగా కేవలం రూ.6 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. సాధారణమార్కెట్‌లో ఫ్లాట్ విలువ సుమారు రూ.50లక్షల వరకు ఉండే ప్రాంతంలో ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పిస్తుండటం లబ్ధిదారులకు గణనీయమైన ప్రయోజనం కలగనుంది. ప్రధాన ఉపాధి కేంద్రాలు, ఐటీ కారిడార్, నగర మౌలిక సదుపాలయాలకు సమీపంలో ఇందిరమ్మ ఇండ్లు అందుబాటులోకి రానుండ టంతో లబ్ధిదారులకు నివాసంతోపాటు రవాణాపరంగా కూడా ప్రయోజనం చేకూరనుంది. 

మొబైల్‌కు నేరుగా అలాట్‌మెంట్ లెటర్లు

ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టు కింద ఎంపికైన లబ్ధిదారులకు సోమవారం (నేడు) నుంచే అలాట్‌మెంట్ లెటర్లు(Allotment letters) జారీ చేయనున్నారు. ఎంపికైన లబ్ధిదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఎస్‌ఎంఎస్, వాట్సప్  యాప్ ద్వారా అలాట్మెంట్ లెటర్లు నేరుగా పంపించనున్నారు. లబ్ధిదారుల రిజిస్ట్రర్ మొబైల్ నంబర్లకు ఎస్‌ఎంఎస్, వాట్సాప్ ద్వారా అలాట్‌మెంట్ లెటర్లను నేరుగా పంపనున్నారు.

దీంతో పాటు తెలంగాణ హౌసింగ్ బోర్డు(Telangana Housing Board) (టీజీహెబీ) వెబ్‌సైట్‌లోనూ లబ్ధిదారుల వివరాలు అందుబాటులో ఉంచనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు, లాటరీ ఎంపిక తదితర ప్రక్రియలకు సంబంధించిన ఆన్‌లైన్ సదుపాయాలు ఇప్పటికే టీజీహెచ్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు