మార్కెట్ ఫీజు లెక్కల్లో గోల్‌మాల్

29-09-2026 | 05:05am
  1. లెక్కకు మించి వ్యాపారం
  2. రైతు మార్కెట్లోనే రోజూ రూ.5 లక్షల లావాదేవీలు 
  3. వంటిమామిడి కూరగాయల మార్కెట్లో ఏటా రూ.300 కోట్లకు పైగా వ్యాపారం
  4. అధికారులకు అందే ఫీజు రూ.2 కోట్లే..
  5. మార్కెట్ ఆదాయానికి భారీగా గండి

గజ్వేల్, సెప్టెంబర్ 28: వంటిమామిడి మార్కెట్లో(Vantimamidi market) మార్కెట్ ఫీజు చెల్లింపులో(Payment of market fees) గోల్ మాల్ జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. సిద్దిపేట జిల్లా(Siddipet District) ములుగు మండలం  వంటిమామిడి కూరగాయల మార్కెట్లో వ్యాపార లావాదేవీలకు(Business transaction), మార్కెట్ రికార్డుల్లో నమోదవుతున్న మొత్తాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక రైతు మార్కెట్లోనే రోజు రూ.5 లక్షల కూరగాయల వ్యాపారం జరుగుతుంది. మార్కెట్లో వ్యాపారులు  ఏడాదికి రూ.300 కోట్లకు పైగా కూరగాయల వ్యాపారం చేస్తున్నప్పటికీ, అధికారికంగా మార్కెట్కు వచ్చే ఫీజు రూ. 2.05 కోట్లు మాత్రమే ఉంటుంది.

వ్యాపారుల వద్ద నూటికి ఒక శాతం చొప్పున మార్కెట్ ఫీజు వసూలు చేస్తుండగా, రూ.300 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుండగా ఒక శాతం చొప్పున రూ. 3కోట్లకు పైగా మార్కెట్ ఫీజు రావాల్సి ఉంది. అధికారులు పాలకవర్గం పర్యవేక్షణ లోపంతో  మార్కెట్ ఫీజు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మార్కెట్ ఫీజు పూర్తిస్థాయిలో వసూలు కాకపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి  పడుతుంది. వ్యాపారుల నుంచి వసూలు చేసే మొత్తాలకు, మార్కెట్లో జరుగుతున్న వ్యాపారం లావాదేవీలకు పొంతన లేకపోవడంతో వ్యాపారులు అధికారులను మోసం చేస్తున్నట్లు అర్థమవుతుంది.

కానీ అధికారులు, సిబ్బంది వ్యాపారులతో కుమ్మక్కై మార్కెట్ ఫీజు పూర్తిస్థాయిలో వసూలు చేయడం లేదని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవంగా ఎంత మేర వ్యాపారం జరుగుతోంది? అధికారికంగా ఎంత నమోదు చేస్తున్నారు? అనే అంశాలపై సమగ్రంగా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్థానికులు  కోరుతున్నారు.

మార్కెట్లో రోజువారీగా జరిగే క్రయవిక్రయాలు, వ్యాపారుల  లావాదేవీలు, మార్కెట్ ఫీజుల వసూళ్లను అధికారులు పరిశీలిస్తే అసలు లెక్కలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించేలా లెక్కల తారుమారు జరుగుతుందా? అన్న కోణంలో ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఇప్పటికే 74 లక్షలు  మార్కెట్ ఫీజు వచ్చింది

గత సంవత్సరం రూ.2.60కోట్ల  మార్కెట్ ఫీజు లక్ష్యం ఉండగా, రూ.2.05 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 2.61 కోట్ల లక్ష్యం ఉండగా, ఆగస్టు నెల ఆఖరి వరకు రూ. 74.62 లక్షలు మార్కెట్ ఫీజు వసూలు అయింది. 3 నెలపాటు రైతు మార్కెట్ కమిటీకి బయట నిర్వహించడం వల్ల ప్రతినెల రూ. 3 లక్షల వరకు ఫీజు తగ్గింది. మార్కెట్ ఫీజు వసూలులో కచ్చితంగా వ్యవహరిస్తున్నాం. సిబ్బంది కొరత ఉన్నా ఎలాంటి తప్పిదాలు జరగడం లేదు.

జాన్ వెస్లీ, ఇంచార్జి కార్యదర్శి మార్కెట్ కమిటీ వంటిమామిడి

మరిన్ని వార్తలు