తీపి కబురు అందేనా?
- 22- ఏ పై స్పష్టత వచ్చేనా..
- కరీం‘నగర’ డంపింగ్‌యార్డు సమస్య తొలగేనా..
- మానేరు రివర్ ఫ్రంట్ పూర్తయ్యేనా?
- రేవంత్ పర్యటనపై నగరవాసుల ఆశలు
కరీంనగర్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) కొత్తపల్లి మండల పరిధిలోని కొత్తపల్లి, రేకుర్తి , విద్యానగర్ పరిధి లో 22ఏ (నిషేధిత) భూముల(22A prohibited lands) సమస్యపై ప్రజలు ఏడాదిగాపోరాటం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) తాజాగా కీలక ఊరటనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు రేకుర్తి భూములకు వర్తించే విషయంలో స్పష్టత రాలేదు. ఈ నెల 30 న కరీంనగర్ కు వస్తున్న సి ఎం రేవంత్ రెడ్డి(C. M. Revanth Reddy) నోట తీపి కబురు అందితుందన్న ఆశతో ఇక్కడి ప్రజలు ఉన్నారు. సుమారు 800 ఎకరాల పరిధిలోని 10,000 పైగా ఇండ్లు, ప్లాట్లు ఈ జాబితాలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో, అసెంబ్లీలో వచ్చిన విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 24, 2026న ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ, డి టి సి పి, హెచ్ ఎం డి ఏ, జి హెచ్ ఎం సి లేదా స్థానిక పురపాలక సంస్థల నుంచి చట్టబద్ధమైన లేఅవుట్ అనుమతులు పొంది ఉంటే, ఆ ఖాళీ స్థలాలు, ఇండ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు తక్షణమే అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్లు జరిగి, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండి కూడా సాంకేతికంగా 22ఏ లో చేరిన ప్లాట్లకు ఈ నిర్ణయంతో పెద్ద ఉపశమనం లభించనుంది.అయితే రేకుర్తి భూములన్నింటికీ పూర్తి విముక్తి లభించేటట్టు లేదు.
ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపు కేవలం చట్టబద్ధమైన ప్రభుత్వ/స్థానిక సంస్థల అనుమతులు కలిగిన ప్లాట్లు, ఇళ్లకు మాత్రమే వర్తిస్తుంది. 22ఏ జాబితాలో ఉన్న వివాదాస్పద ప్రభుత్వ భూములు, అసైన్డ్, వక్ఫ్ లేదా కోర్టు పరిధిలో ఉన్న భూముల విషయంలో ఇంకా పూర్తి స్థాయి స్క్రీనింగ్ జరగాల్సి ఉంది. అందువల్ల రేకుర్తి భూములకు పూర్తిగా విముక్తి లభించాలంటే అధికారిక అనుమతి పత్రాలు ఉండటం తప్పనిసరి కానుంది. రేకుర్తి భూముల కు సంబంధించి పూర్తి స్పష్టత కోసం ప్రజలు ఎదిరి చూస్తున్నారు. రేపు సి ఎం కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించి సమీక్ష లో ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ సిద్ధం అయ్యారు.
డంపింగ్ యార్డ్ తరలేనా... దశాబ్దాలుగా పేరుకుపోయిన లక్షలాది మెట్రిక్ టన్నుల చెత్తతో కరీంనగర్ డంపింగ్ యార్డ్ నిత్యం మంటలు, దట్టమైన పొగతో కాలుష్య కుంపటిలా మారుతోంది. కరీంనగర్ లో బి ఆర్ ఎస్ హయాంలో అట్టహాసంగా ప్రారంభించిన కేబుల్ బ్రిడ్జిపై లైట్లు వెలగడం లేదు. రాత్రయితే బ్రిడ్జిపై అంధకారం అలుముకుంటోంది. దీంతో కరీంనగర్ వాసులకు లోయర్ మానేరు డ్యామ్, ఉజ్వల పార్కు తప్ప మరో ఆహ్లాదకర ప్రాంతమే లేకుండా పోయింది.
కరీంనగర్ నగరానికి పర్యాటక శోభను తీసుకొచ్చేందుకు మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ను గత సర్కార్ ప్రారంభించింది. మాజీమంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ రివర్ ఫ్రంట్ పనులకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ లో 90 శాతం పనులు పూర్తయ్యాయి. మరో రూ.100 కోట్లతో వ్యూయింగ్ గ్యాలరీ, ఎంట్రీ ప్లాజా, మ్యూజికల్ ఫౌంటేయిన్ ల నిర్మాణం కావలసి ఉంది. ఈ పనులు పూర్తికావలంటే సర్కారు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది లేకుంటే వందల కోట్లు మానేరు పాలు అయ్యే ప్రమాదం ఉంది.