కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
వరంగల్: మాజీ మంత్రి కొండా సురేఖ(Former Minister Konda Surekha) మంగళవారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ఎంజీఎం ఆసుపత్రి అంశంపై స్పందిస్తూ, కొంతమంది ఎంజీఎంను సందర్శించే పేరుతో హడావుడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి(Super Specialty Hospital)ని త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కొండా సురేఖ తెలిపారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి తగినంత సమయం కేటాయించలేకపోయానని పేర్కొన్నారు. ఇకపై వారానికి ఒక రోజు చొప్పున ఒక్కో డివిజన్‌లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుంటానని చెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: అక్టోబర్ 1న కేబినెట్ భేటీ.. అజెండాలో ఇవే!
రానున్న కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అంతర్గత విభేదాలను పక్కనపెట్టి సమష్టిగా పార్టీ కోసం పనిచేయాలని కోరారు. అదే సమయంలో కొందరు నేతలు బాధ్యతాయుతంగా, మాటలను అదుపులో ఉంచుకుని మాట్లాడాలని కొండా సురేఖ సూచించారు.