అస్థిత్వ పతాక ‘కుంపటి’

21-09-2026 | 05:05am

డా. బాణాల శ్రీనివాసరావు :

‘కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం

జాలరి పగ్గం, సాలెల మగ్గం,

శరీర కష్టం స్ఫురింపజేసే

గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి

సహస్రవృత్తుల సమస్తచిహ్నాలు’ 

.. అంటూ ఆధునిక తెలుగుకవిత్వాన్ని(Modern Telugu Poetry) శ్రీశ్రీ (Sri Sri) ఒక మలుపుతిప్పాడు. ఆయనలో కదిలే నవ్యకవిత్వం కార్మికలోకపు కళ్యాణానికి, శ్రామికలోకపు సౌభాగ్యానికి సమర్పణంగా, సమర్చనంగా రాస్తూ పైన చెప్పిన వృత్తిచిహ్నాలు(Professional symbols) జగత్తుకంతా చవులిచ్చేలా భావివేదములు, జీవనాదములౌతా యనీ ‘ప్రతిజ్ఞ(Pledge)‘ పలికాడు. అదే మాట అక్షరాలా నిజమయిందీ, ఇవాల్టి కవిత్వానికదే విజనయింది! అనాది పురుషాధిపత్య భావాల్నీ, పోకడల్నీ తునుమాడేలా స్త్రీ గొంతుకలు గర్జించాయి. తరతరాల వివక్షను, అంటరానితనాన్ని ఎండగడుతూ, ఆ నైజమున్న మెదళ్లకు కుండగొడుతూ ‘దళిత కవిత్వం’ నిలువెత్తు నిరసనయిందీ, ప్రతిఘటనయింది. దానిలోంచే బీసీవాద కవిత్వం గొంతుకెత్తింది. 

    కవి బాణాల శ్రీనివాసరావు ‘పర్యాయపదం’ అనే కవితాసంపుటి వేసినా.. ఆయన ‘కుంపటి’ కవిగానే లబ్దప్రతిష్టులయ్యాడు. అది కేవలం 199 పంక్తుల దీర్ఘకవిత. చాలా స్పందన సంపాదించుకున్న కవిత. ఆ ఒక్క కవిత మీద వ్యాససంకలనమే రావడం విశేషం. ఈ కవిత తన పల్లెటూరి పరిచయంతో మొదలవుతుందిలా.. 

‘కంటికి దూరం కాలుకి దగ్గర మావూరు/మునగాల చెరువుగాలి అలలమీంచి ఎగురుతూ/ చెరువు కట్టమీంచి జారుకుంటూ/ మంగలోళ్ల మామిళ్ల చల్లని నీడల్లోంచీ/ పాటిగడ్డ దాటి మడికట్లల్లోంచీ పోతే మా వూరు/ ఇప్పటికీ రోజుకో ఎర్రబస్సయినా ఎల్లని పచ్చి పల్లెటూరు/ పదహారణాల తెలంగాణ కుగ్రామం/మా తురకగూడెం’.

      కవితను పల్లెను తలపోయడంతో మొదలు పెట్టడానికున్న ఔచిత్యమొకటే.. పల్లెకూ, కుంపటికీ, కుంపటిద్వారా కవి చెప్పబోయే కుల వృత్తికీ పల్లెతో విడదీయలేనంత పుట్టుమచ్చ బంధముండటమే! కుంపటి స్వర్ణకారుల జీవితానికి ప్రతీకగా తీసుకుని కవి కులవృత్తిగొప్పదనాన్ని, వాళ్ల బతుకు కష్టాలను ప్రతిభావంతంగా రాశాడు.

‘తూర్పున పొద్దు పొడవకముందే/మా ఇంటి ఆకాశంలో/ కళ్లు తెరిచే కుంపటి సూర్యుడు//ముసుగుతన్ని పడుకున్న నాకు/జై శాంభవి అన్న పలుకు/పట్టెడ మీద పడే సుత్తిదెబ్బ/నా చెవుల్లో గింగిర్లు తిరిగేవి// పొద్దున్నే నన్ను స్కూలుకు లేపే/అలారం మోత నాయిన సుత్తిదెబ్బే//”

      ఈ స్టాంజాలో పొద్దుపొడవక ముందే కంసాలి ముద్దకోసం కుంపటి వెలిగిస్తాడనీ, ఆ కుంపటే వాళ్ల బతుక్కి వెలుగునిచ్చే సూర్యుడనీ చెప్పాడు. పొద్దున్నే స్కూలుకు లేపే అలారం మోత నాయనకొట్టే సుత్తిదెబ్బ అన్నాడుగదా! దీనిద్వారా తండ్రి వృత్తి చేస్తూ, బిడ్డల్ని చదివించిన ఘనతవుంది. ఆ రకంగా కవి బాణాల వాళ్ల ఇంటిలో తొలితరం విద్యావంతుడయ్యాడు. అందువల్లే ఇంత కాకవున్న కవితాకుంపటి వెలిగింది. 

‘సగం తెరిచిన కళ్లతో/దుకాణంలోకి చూస్తే/యజ్ఞగుండం ముందు ఋషిలా/ఒక చేత్తో గొట్టాన్ని ఊదుతూ/మరో చేత్తో నీరుకారును/కుంపట్లో నాట్యం చేయిస్తూ/రెండు చేతుల్నీ సవ్యసాచిలా ఆడిస్తూ/చెంపలకు రెండు బెలూన్లను తగిలించుకుని/తీక్షణమైన చూపుల్తో/ఊపిరితిత్తుల్లోని గాలినంతా/కుంపట్లోకి ఊదితే/ఏ కాలంనాటి ఎండి బంగారమైనా/మూసల్లో నీళ్లలా కరగాల్సిందే/నీళ్లల్లో తడిసిన దిమ్మెను/పట్టెడమీద పెట్టి కొట్టే సుత్తిదెబ్బలకు/మా ఇల్లే కాదు/వూరు వూరంతా మారుమోగిపోయి /

పట్టెడ మీద హొయలు పోయే ఇంద్రచాపం//”

     ఏ వృత్తికైనా నిపుణతే ఆకర్షణ. ఏదో పని ఎవరైనా చేస్తారు. మనం బట్టలు ఉతక్కొచ్చు కానీ చాకలి ఉతికిన తెల్లదనం, కమ్మదనం మనకు చేతగాదు. అది అతడి నైపుణ్యం. అలాగే స్వర్ణకారుడి నైపుణ్యం స్వర్ణకారుడిదే. కవి తన తండ్రి చేసే వృత్తి నైపుణ్యాన్ని, కష్టాన్ని మనముందర పరిచాడు. యజ్ఞకుండం ముందు ఋషిలా అ న్నప్పుడు నిష్టాగరిష్టతను, ఊ పిరితిత్తుల్లోని గాలినంతా కుం పట్లోకి ఊదడం అన్నప్పుడు వృత్తిలోని కష్టాన్ని కళ్లకు కట్టించాడు. వీటితో పాటు ఇదివరకు కవిత్వపుటలమీద నమోదుకాని వృత్తిసంబంధమైన పదాలను రికార్డు చేసాడు. పట్టెడ, సుత్తి, కుంపటి, గొట్టం, నీరుకారు, మూస, గాడిరాయి, బెలూన్లు, దిమ్మె, జవ్వగారు, బుంగకారు, చిల్ల, పాంచల, పుచ్చపోగరు, బరమా, రం పసుట్టం, కడగొట్టం, కమ్మెచ్చు, ఆకురాయి, మెట్టెలకడ్డీ, గజ్జెలదిమ్మ, పోగర్లు, శ్రవణాలు వంటి పదాలతో కవితకు నూతనభాషను తొడిగాడు. వాటితో ఉన్న విడదీయలేని అనుబంధాన్ని రంగరించి రాశాడు. ఇక కుం పటిని దేనిదేనికి ప్రతీకలుగా చాటుతున్నాడో చూడండి..

‘కుంపటి మా ఇళ్లకు వెలుగు/అది మా నాయనకు నిశాని/మా తాతకు ప్రతీక/మా తరతరాల వారసత్వాల కులవృత్తికి చిత్రిక/మా కులం మొత్తానికే సజీవసంకేతం/ కుంపటి మమ్మల్ని పలికించే తంత్రీనాదం/మా బడు గువర్గాల పర్యాయపదం’.

    కుంపటిని జీవితంగానూ, జీవన వేదంగానూ, గుండె ధైర్యంగానూ, కన్నీళ్లు తుడిచే చేయిగానూ చెప్పడంతో పాటూ అది బడుగువర్గాల పర్యాయపదంగా చెప్పడమూ కవితావుద్దేశం. అవును, బడుగు బలహీన వర్గా లది ఒకటే కవితామతం.. వాళ్లందరూ ప్రగతిపథంలోకి రావాలన్నదే!! కుంపటి స్వర్ణకారుల ఇంట్లో ప్రధానం ఎందుకయిందో తెలియాలంటే ఈ పాదాల్లోకి నడవండి..

    పనిముట్లే జీవనాడులు. రైతుకు నాగలి, కూలమ్మకు కొడవలి, చాకలికి బండ, మంగలికి కత్తెర, కుమ్మరికి సారె బువ్వపెడతాయి. ఒక కవి చాకలిబండను ఆకలితీర్చే అండ అన్నాడు. ఇంకొక కవి కుమ్మరి పనిముట్టును ‘బువ్వకుండ’గా వర్ణించాడు. ఇక్కడ కవి కుంపటిని ‘వెన్నెలదీపం’ అన్నాడు. వెన్నెలంత చల్లగా వాళ్ల బతుకుల్ని కనికరిస్తుందనే సంకేతాన్ని లోపలి శబ్దంగా పొదిగాడు.  

   కుంపటి మీద, నాయిన మీద, తనమీద రాసుకున్నట్టే ఉన్నా.. ఇది బీసీ కవితాధ్యేయాన్ని బలంగా ఎత్తుకున్నది. ఎవరి అస్థిత్వాన్ని వాళ్లు, ఎవరి వృత్తి గొప్పతనాన్ని వాళ్లు, ఎవరి గౌరవాన్ని వాళ్లు జగత్తుకు పరిచయం చేయ డం ద్వారా సమస్తవృత్తులపై ఆదరణభావం, మన్ననభావమూ ఇనుమడింపజే యవ చ్చు. ఎన్ని గజాలు రాసావన్నది కాదు ఎన్ని నిజాలు మాట్లాడావన్నదే ప్రధానమన్నడో కవి. నిజజీవితాన్ని కవిత్వం సిరాగా చేసుకుని ‘కుంపటి’ కవితను రాసిన బాణాల అభినందనీయుడు.

మెట్టా నాగేశ్వరరావు

(9951085760)

మరిన్ని వార్తలు