రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ వేగవంతం చేయాలి

10-09-2026 | 04:15am

నేషనల్ హైవే అధికారులకు భూమి అప్పగించేలా చర్యలు

ఆర్‌అండ్బీ ప్రత్యేక కార్యదర్శి కె. గంగాధర్

గజ్వేల్, సెప్టెంబర్ 9: రీజనల్ రింగ్ రోడ్ (Regional Ring Road) భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, నేషనల్ హైవే అధికారులకు భూమిని అప్పగించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కె. గంగాధర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం గజ్వేల్ పట్టణంలోని సమీకృత కార్యాలయ సముదాయంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి(District Collector K. Haimavathi)తో కలిసి నేషనల్ హైవే, రెవెన్యూ శాఖ అధికారులతో ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్ సిద్దిపేట జిల్లాలో రాయపోల్, వర్గల్, మర్కుక్, గజ్వేల్, జగదేవ్పూర్ మండలాల మీదుగా వెళ్తుందని తెలిపారు. భూసేకరణలో పెండింగ్లో ఉన్న అర్బిట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఆర్‌ఆర్‌ఆర్తో ప్రాంతానికి కలిగే అభివృద్ధి, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ఆర్డీఓ ఆధ్వర్యంలో తహసీల్దార్లు, ఇతర సిబ్బంది భూసేకరణను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.

భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో డ్రోన్ సర్వే నిర్వహించి, రైతులు కొత్తగా పంటలు సాగు చేయకుండా భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న భూమిని నిబంధనల ప్రకారం నేషనల్ హైవే అధికారులకు అప్పగించాలని సూచించారు. అప్పగించిన భూమి బాధ్యత పూర్తిగా నేషనల్ హైవే అథారిటీదేనని, భూముల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, నేషనల్ హైవే అధికారులు, ఆయా మండలాల తహసీల్దార్లు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు