calender_icon.png 23 February, 2026 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాతృభాషను కాపాడుదాం!

21-02-2026 12:00:00 AM

మూలాలు మరచినప్పుడు మన అస్థిత్వమే ప్రశ్నార్ధకమౌతుంది. మన భాషను త్యజించిననాడు మన చరిత్ర కనుమరుగవుతుంది. మాతృభాష అనే ది మన సంస్కృతి, సంప్రదాయాలను, నాగరికతను ప్రతిబింబించే మహోన్నత సంపద. పర భాషలను గౌరవిస్తూ మాతృభాషను తృణీకరించడం భావ్యం కాదు. ఆంగ్ల భాషా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా అంతరిస్తున్న మాతృభాషలను  పరిరక్షించవలసిన తరుణం ఏర్పడింది.

ఈ సందర్భంలో మనల్ని మనం అవమానించుకుంటూ, కేవలం స్వలాభం కోసం ఇతరులపై చూపించే కృత్రిమ మమకారాన్ని వదిలిపెట్టాలి. భాష విషయంలో కూడా ఇదే సూత్రాన్ని అన్వయించాలి. ఉపాధి కోసమో, ఉద్యోగం కోసమో వివిధ దేశాల సంప్రదాయాలను అవగతం చేసుకోవడం కోసమో, విజ్ఞాన సముపార్జన కోసమో, పరభాషలను నేర్చుకోవడం తప్పనిసరి. అదే సమయంలో మన మాతృభాషలను గౌరవించి, మా తృభాషల మనుగడను కొనసాగించాలి. ప్రపంచంలో ఎన్నో భాషలు మ నుగడ సాగించినప్పటికీ కొన్ని భాషలు పరభాషాధిక్యతతో అంతరించిపోతున్నాయి.

వేలాది సంవత్సరాల చరిత్ర గల వేలాది భాషలు కేవలం వేళ్ల సం ఖ్యలో లెక్కించే దీనస్థితికి చేరుకున్నా యి. వివిధ దేశాల, ప్రాంతాల ప్రజల సంస్కృతిని, అస్థిత్వాన్ని కొనసాగించాలంటే ఆయా మాతృభాషలను గుర్తిం చి, గౌరవించి, పరిరక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అందుకే అంతరించిపోతున్న మాతృభాషలను రక్షించి, వాటి మనుగడను కొనసాగించాలనే లక్ష్యంతో యునెస్కో 2020 నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచ వ్యాప్తంగా ‘మాతృభాషా దినోత్సవం’ నిర్వహిస్తున్నది. ప్రపంచంలో అత్యధికంగా 1.5 బిలియన్ మంది ప్రజలు ఆంగ్ల భాషనే మాట్లాడుతున్నారు.

భారత్ జనాభాలో 19 శాతం మంది ఆంగ్లం మాట్లాడుతున్నారు. ఆంగ్లంతో పాటు స్పానిష్, అరబిక్, ఫ్రెంచి, రష్య న్, ఫోర్చుగీసు, రష్యన్ భాషలు ప్రపంచంలో తమ ఆధిక్యతను కొనసాగిస్తున్నాయి. మన దేశంలో హిందీ అత్యధికులు మాట్లాడే జాతీయ భాష. ప్రపంచంలో వంద కోట్లకు పైగా హిందీ మాట్లాడతారు. మరికొన్ని దేశాల్లోనూ హిందీ అధికార భాషగా ఉండడం విశేషం. మన దేశంలో హిందీ తర్వాత ఎక్కువగా బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, గుజరాతీ భాషలు అత్యధికంగా మాట్లాడే ప్రాంతీయ భాషలు. ఒకప్పుడు ఎంతో  వైభవాన్ని చవిచూసిన తెలుగు భాషా వైభవం క్రమేపీ క్షీణిస్తున్నది.

భారత దేశంలో  హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానానికి దిగజారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలతో పాటు యానాం,అండమాన్ నికోబార్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తదితర రాష్ట్రాలు సహా విదేశాల్లోనే తెలుగు తన అస్థిత్వం కొనసాగిస్తున్నది. భాషా వైవిధ్య పరిరక్షణ అత్యంత ప్రధానమైన అంశం. ఒకప్పుడు తెలుగు భాష పద్య, గద్యాలతో ప్రాభవంగా వెలు గొందింది.

పలు సంస్కృత కావ్యాలు  తెనుగీకరించబడి తెలుగు నేలపై భాషా సౌందర్యాన్ని వెదజల్లాయి. ప్రాచీన చారిత్రక నేపథ్యం కలిగిన తెలుగు భాష ను పదిల పరచుకోవాల్సిన అవసరముంది. తెలుగు అనేది కేవలం అక్షరాల సమూహం కాదు. ఒక విలక్షణమైన, విశిష్ఠమైన సంస్కృతికి వేదిక. తెలుగు భాష కోసం అవిశ్రాంతంగా శ్రమించిన భాషాభిమానుల ఆశయం నెరవేరేందుకు మరో ఉద్యమం అవసరం. ఇతర భాషలను నేర్చుకుంటూనే మాతృ భాషను గౌరవించడం మన కర్తవ్యం.

 సుంకవల్లి సత్తిరాజు, 9704903463