27 June, 2026 | 10:23 PM

గర్భాశయం వెలుపల పిండం పెరగడంతో ప్రాణాపాయ స్థితికి చేరిన యువతి

27-06-2026 09:17 PM

అత్యవసర శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ చందానగర్ వైద్యులు

పటాన్ చెరు: తీవ్ర కడుపు నొప్పి, రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోవడం, అధిక అంతర్గత రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో మెడికవర్ హాస్పిటల్స్‌కు చేరిన 34 ఏళ్ల మహిళకు వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడారు. కొన్ని రోజులుగా నెలసరి ఆలస్యం కావడంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి, తీవ్ర నీరసం, అస్వస్థతతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షించే సమయానికి ఆమె రక్తపోటు కేవలం 70/40 mmHg మాత్రమే ఉండగా, గుండె స్పందన నిమిషానికి 160 సార్లు నమోదైంది.

పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఎమర్జెన్సీ వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించి ఐసీయూకు తరలించారు. ద్రవాలు అందించినప్పటికీ రక్తపోటు మెరుగుపడకపోవడంతో ప్రత్యేక ఇనోట్రోప్ మందుల సహాయంతో చికిత్స కొనసాగించారు. ఇదే సమయంలో రోగికి మూర్ఛ లక్షణాలు కనిపించడంతో వెంటనే వెంటిలేటర్‌పై ఉంచి శ్వాసనాళాన్ని రక్షించారు. తదుపరి నిర్వహించిన పరీక్షల్లో గర్భధారణ నిర్ధారణ కావడంతో పాటు అల్ట్రాసౌండ్‌లో గర్భాశయం వెలుపల పిండం పెరగడం (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ), ఫెలోపియన్ ట్యూబ్ పగిలిపోవడంతో కడుపులో భారీగా రక్తస్రావం జరిగినట్లు వైద్యులు గుర్తించారు.

వెంటనే బ్లడ్ బ్యాంక్‌ను అప్రమత్తం చేసి అత్యవసరంగా రక్తం అందుబాటులోకి తెచ్చి శస్త్రచికిత్స చేపట్టారు. డా. భావ్య, Senior Consultant Obstetrician & Gynecologist, Laparoscopic & Fertility Specialist నేతృత్వంలోని ప్రసూతి & గైనకాలజీ బృందం అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించి పగిలిపోయిన కుడి ఫెలోపియన్ ట్యూబ్‌ను తొలగించారు. కడుపులో పేరుకుపోయిన సుమారు 1.5 నుంచి 2 లీటర్ల రక్తాన్ని తొలగించి రక్తస్రావాన్ని పూర్తిగా నియంత్రించారు.

అనంతరం డా. రాజు, Critical Care Department ఆధ్వర్యంలో ఐసీయూలో వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించారు. చికిత్స సమయంలో రోగికి అవసరమైన రక్త భాగాలను అందించడంతో పాటు ఎమర్జెన్సీ మెడిసిన్, క్రిటికల్ కేర్, ప్రసూతి & గైనకాలజీ, అనస్థీషియా, బ్లడ్ బ్యాంక్ మరియు నర్సింగ్ బృందాల సమన్వయంతో సమగ్ర చికిత్స అందించారు. ఫలితంగా రోగి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడి వెంటిలేటర్, ఇనోట్రోప్ మందుల అవసరం లేకుండా కోలుకుని ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ... ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మహిళల ప్రాణాలకు ముప్పు కలిగించే అత్యవసర పరిస్థితి అని తెలిపారు. నెలసరి ఆలస్యం, తీవ్రమైన కడుపు నొప్పి, తలతిరగడం, బలహీనత లేదా అకస్మాత్తుగా రక్తపోటు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సకాలంలో నిర్ధారణ, అత్యవసర శస్త్రచికిత్స మరియు మల్టీడిసిప్లినరీ వైద్య బృందం సమన్వయంతో చికిత్స అందించడం వల్లే ఈ మహిళ ప్రాణాలను కాపాడగలిగామని పేర్కొన్నారు.