14 April, 2026 | 1:40 AM

నేడు ఖమ్మంకు ‘మహేష్’ రాక

14-04-2026 12:22 AM
  1. జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు పర్యటన

పలు అభివద్ది పనులకు శంకుస్థాపనలు.. 

అప్రమత్తమైన పోలీసులు.. 

ఖమ్మం, ఏప్రిల్ 13(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు(పీసీసీ) మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకార మహోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తెలిపారు.

ఇటీవలే నూతనంగా నియమించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పూర్తి స్థాయి కార్యవర్గాన్ని, సభ్యులను ప్రమాణస్వీకారం చేయించి, ఆ తరువాత బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉధ్దేశించి ఆయన ప్రసంగించనున్నారు

జిల్లాలో పర్యటించనున్న మంత్రులు

ఖమ్మం జిల్లాలో మంగళవారం ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ, హౌసింగ్, సమాచారా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోతు రాందాసు నాయక్ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.

మంత్రి భట్టి విక్రమార్క మధిర, ఖమ్మం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఆ తరువాత మధిర నియోజకవర్గంలో జరిగే పలు అభివద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు  నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఇప్పటికే ఖమ్మం నగరంలో పర్యటిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం కూడా ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ కార్యాలయంలో జరిగే ప్రమాణస్వీకరమహోత్సం కార్యక్రమానికి హాజరై, ఆ తరువాత ఖమ్మం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్నారు. వీరందరు ఖమ్మం పార్టీ కార్యాలయంలో జరిగే ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరుకానున్నారు. 

అప్రమత్తమైన అధికారులు, పోలీసులు

ఖమ్మం జిల్లాలో మంగళవారం ముగ్గురు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీసులు, అధికారులు అప్రమత్తమైయ్యారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్ల్యాలయం వద్ద నేడు పోలీసులు పట్టిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు మంత్రుల పర్యటనపై అప్రమత్తంగా ఉన్నారు.