అరుణా గోదాం అక్రమ నిర్మాణంలో బరితెగింపు
- ఎల్లంపేట్ మున్సిపల్ అధికారుల ఉదాసీనత
ప్రభుత్వ ఆదాయానికి కోట్లల్లో గండి
మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 13 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని అరుణా గోదాం అక్రమ నిర్మాణం గడిచిన 3 సంవత్సరాలుగా కొనసాగుతున్న మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా,ఎటువంటి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణ వ్యవహారంలో మున్సిపల్ అధికారుల మొండి వైఖరినీ ప్రదర్శిస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు. ఇలాంటి అక్రమ నిర్మానాల వల్ల భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, స్థానిక ప్రజలు పలుమార్లు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్కు, టౌన్ ప్లానింగ్ విభాగానికి చాలాసార్లు వినతి పత్రాలు సమర్పించారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ, అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోమేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కమిషనర్ కార్యాలయం నుంచి కనీస స్పందన లేదనే భావన నెలకొంది. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అక్రమ నిర్మాణదారులకు వత్తాసు పలుకుతోందా అనే అనుమానం కలుగుతోందనే స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు తుంగలో తొక్కి అరుణా గోదాం పనులు యధావిధిగా కొన సాగుతున్నాయి.ఈ అక్రమ నిర్మాణం వల్ల ప్రభుత్వానికి కోట్లల్లో ఆదాయం గండి పడుతుంది. లిఖితపూర్వక ఫిర్యాదులు అందినప్పటికీ చర్యలు శూన్యమని స్థానికులు హెచ్చరిస్తున్నారు. మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించాల్సిన అధికారులే మిన్నకుండిపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి,ఎల్లంపేట్ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.డిప్యూటీ కమిషనర్ అరుణ గోదాం విషయంలో స్పందిస్తూ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చామని సమాధానం ఇస్తూ ప్రస్తుతం గోదాంని స్టాప్ చేశామని చెప్పారు.




