మంచిర్యాలలో నాకాబందీ
- విస్తృతంగా వాహనాల తనిఖీ
మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్(Mancherial DCP Eggadi Bhaskar) తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో ఆకస్మిక నాకాబందీ నిర్వహించి వాహనాలను విస్తృతంగా తనిఖీ(Vehicle Checks) చేశారు. అక్రమ రవాణా, గంజాయి, ఇతర మత్తు పదార్థాల తరలింపును అడ్డుకోవడం, అనుమానిత వ్యక్తులు, వాహనాలను గుర్తించడం, దొంగతనాలు, చైన్ స్నాచింగ్(Chain snatching) వంటి నేరాలను నియంత్రించడమే నాకాబందీ ప్రధాన ఉద్దేశమని డీసీపీ వివరించారు.
అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను ఆపి వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ ధ్రువపత్రాలను పరిశీలించినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్(Drunk And Driv), ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సరైన పత్రాలు లేకపోవడం వంటి ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు చెప్పారు.
మార్కెట్ ప్రాంతాలు, బ్యాంకులు, విలువైన వ్యాపార సంస్థల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని డీసీపీ తెలిపారు. బ్యాంకులకు వచ్చే ఖాతాదారుల దృష్టిని మళ్లించి చోరీలకు పాల్పడే ముఠాల కదలికలపై నిఘా ఉంచామని చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆర్మ్డ్ పార్టీలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
వాహనాలకు తప్పనిసరిగా సరైన నంబర్ ప్లేట్ ఉండాలని, నంబర్ ప్లేట్ లేకుండా, మార్చిన లేదా నకిలీ నంబర్ ప్లేట్లతో వాహనాలు నడపవద్దని సూచించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్సు, వాహన పత్రాలు, ఇన్సూరెన్స్ కలిగి ఉండటంతో పాటు ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ ధరించాలని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ నాకాబందీ, వాహన తనిఖీలను మరింత కఠినంగా కొనసాగిస్తామని డీసీపీ భాస్కర్ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్‌రావు, ట్రాఫిక్ సీఐ, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.