9 August, 2026 | 4:19 PM

గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం

09-08-2026 02:20 PM

ముత్తారం సర్పంచ్‌ల ఫోరానికి మంత్రి శ్రీధర్‌బాబు హామీ

ముత్తారం, ఆగస్టు 9 (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి, ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) హామీ ఇచ్చారు. ముత్తారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో పలువురు సర్పంచ్‌లు శనివారం మంత్రి శ్రీధర్‌బాబును హైదరాబాద్ లో కలిసి గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను సర్పంచ్‌లు మంత్రికి వివరించారు. ముఖ్యంగా విద్యాభివృద్ధి, యువతకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పన, గ్రామీణ రహదారులు, పారిశుద్ధ్యం తదితర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. గ్రామ పంచాయతీలకు అవసరమైన సహకారం అందించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సర్పంచ్‌లు విజ్ఞప్తి చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా అదనపు అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

సర్పంచ్‌లు ప్రస్తావించిన సమస్యలను మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా విన్నారని, గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తెలిపారు. దీంతో మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండలానికి చెందిన పలువురు సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.