ఆదర్శంగా.. ఎంపీడీవో పాటిల్ జ్యోత్స్న
వాంకిడి,(విజయక్రాంతి): బాలికలకు ఆదర్శంగా నిలుస్తూ.. వారి భవిష్యత్‌కు దిశానిర్దేశం చేస్తూ వాంకిడి ఎంపీడీవో పాటిల్ జ్యోత్స్న ‘గర్ల్ చైల్డ్ రోల్ మోడల్’గా విద్యార్థినులకు స్ఫూర్తినిచ్చారు. గురువారం పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ వాంకిడి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని బాలికలకు విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జ్యోత్స్న మాట్లాడుతూ... బాలికలు తమ లక్ష్యాలను చిన్నవిగా భావించకుండా ఉన్నత ఆశయాలతో ముందుకు సాగాలని సూచించారు.
ప్రతిరోజూ పాఠశాలకు హాజరై శ్రద్ధగా చదువుకోవాలని, విద్యతోనే తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పారు. చదువుతోపాటు క్రీడలు, ఇతర రంగాల్లోనూ ప్రతిభ కనబరచాలని ప్రోత్సహించారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలనను అలవర్చుకుంటే ప్రతి బాలిక భవిష్యత్తులో ఒక రోల్ మోడల్‌గా ఎదగగలదని తెలిపారు.
మహిళా సాధికారత ప్రాధాన్యతను వివరిస్తూ.. సమాజంలో బాలికలు తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించేలా కష్టపడాలని సూచించారు. విద్యార్థినులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి లక్ష్యాలను తెలుసుకుని, వాటిని సాధించేందుకు అవసరమైన మార్గనిర్దేశం చేయడంతో కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా సాగింది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి, ఖిర్డీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు తదితరులు పాల్గొన్నారు.






