గ్రామాల అభివృద్ధితో కొత్త శోభ

28-09-2026 | 05:30am
  1. మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

చింతకాని, సెప్టెంబర్ -27 (విజయక్రాంతి): పర్యాటక వసతుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాలకు కొత్త శోభ తీసుకురావడంతో పాటు స్థానికంగా ఉపాధి, ఆర్థిక అవకాశాలు పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Deputy CM Bhatti Vikramarka Mallu)తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో ఆదివారం కలెక్టర్ దివాకర టిఎస్, సీపీ సునీల్ దత్‌లతో కలిసి డిప్యూటీ సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

చింతకాని మండల కేంద్రంలోని చెరువు వద్ద రూ.7 కోట్ల 90 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పర్యాటక వసతుల కల్పన పనులకు, పందిళ్లపల్లి నుండి అనంతసాగర్ మీదుగా చింతకాని జడ్పీ రోడ్డు వరకు రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, జగన్నాథపురంలో ఖమ్మంబోనకల్ ఆర్‌అండ్బీ రోడ్డు నుండి న్యూ మార్కెట్ మీదుగా  మత్కేపల్లి పందిళ్లపల్లి వరకు రూ. 4 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పంచాయతీరాజ్ బీటీ రోడ్డు నిర్మాణ పనులకు,

చింతకాని పరిధిలోని నరసింహాపురం ఎస్సీ కాలనీలో రూ.18 లక్షలతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు,  నాగులవంచ గ్రామంలో నాగులవంచ నుండి రైల్వే కాలనీ ఆర్ అండ్ బీ రోడ్డు అండర్పాస్ వరకు రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

పర్యాటక ప్రాంతాల్లో మౌళిక వసతులను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పనలో భాగంగా గత 34 నెలలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామనితెలిపారు.   ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని, ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.60 పైగా విలువైన సన్న బియ్యాన్ని రాష్ట్రంలోని కోటి 6 లక్షల కుటుంబాలకు ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.

దేశంలో ఎక్కడా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం లేదన్నారు. గతంలో ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేశారని, ప్రస్తుతం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తూ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 5 లక్షలు జమ చేస్తున్నామని తెలిపారు.  కార్యక్రమాల్లో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, పీఆర్ ఎస్‌ఇ వెంకట్ రెడ్డి,  విద్యుత్ శాఖ ఎస్‌ఇ శ్రీనివాసా చారి, ఆర్ అండ్ బి ఎస్‌ఇ యుగంధర్ రావు, సిపిఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు