19 August, 2026 | 3:55 PM

ఈడీ విచారణకు నిధి అగర్వాల్

19-08-2026 03:20 PM

హైదరాబాద్: బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌కు సంబంధించిన కేసులో జరుగుతున్న విచారణలో భాగంగా ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్(Nidhhi Agerwal) బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ముందు విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలలో హైదరాబాద్‌లోని ఈడీ (ED) కార్యాలయానికి నిధి అగర్వాల్ చేరుకోవడం కనిపించింది. అక్కడ ఆమెను పోలీసు భద్రత మధ్య లోపలికి తీసుకెళ్లారు.

ఈ వ్యవహారానికి సంబంధించి ఆమె గతంలోనే హైదరాబాద్‌లోని సీఐడీ (CID) ముందు హాజరైన కొన్ని నెలల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. తన లావాదేవీలకు సంబంధించిన ఈడీ కార్యాలయానికి నిధి అగర్వాల్ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను తీసుకెళ్లినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్(Promotion of betting apps) చేసినట్లు, ప్రమోషన్ ద్వారా హవాలా రూపంలో డబ్బులు తీసుకున్నట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. తీసుకున్న డబ్బును లెక్కల్లో చూపించలేదని ఈడీ అధికారులు నిధి అగర్వాల్ పై అభియోగాలు మోపారు. 14 బెట్టింగ్ యాప్స్‌కు సెలబ్రిటీల ప్రమోషన్లపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.

విచారణ నిమిత్తం ఆమెకు అంతకుముందే ఈడీ అధికారులు నోటీసు జారీ చేశారు. అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుండగా, ఇప్పటివరకు 21 మంది ప్రముఖులపై అధికారులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికల ద్వారా అక్రమ బెట్టింగ్, జూదం (gambling) యాప్‌లను ప్రోత్సహించారన్న ఆరోపణలతో, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి వంటి ప్రముఖులతో సహా పలువురు సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై తెలంగాణ పోలీసులు గత ఏడాది ఎఫ్‌ఐఆర్ (First Information Report) నమోదు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో, 32 ఏళ్ల వ్యాపారవేత్త పి.ఎం. ఫణీంద్ర శర్మ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.