25 August, 2026 | 5:15 PM

ప్రజా సంక్షేమం కోసమే అనేక కార్యక్రమాలు

25-08-2026 04:44 PM

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

అనంతరం మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కొత్తపల్లి గోరి, ఆగస్టు 25 ( విజయక్రాంతి ): కొత్తపల్లి గోరి మండలంలో సుల్తాన్‌పూర్, కొత్తపల్లి గోరి, చిన్నకోడెపాక గ్రామాల రైతు వేదికలలో నిర్వహించిన కార్యక్రమాల్లో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిధిగా హాజరై స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం జగ్గయ్యపేట, సుల్తాన్‌పూర్, గోరికొత్తపల్లి, చిన్న కోడెపాక, చెన్నాపూర్ గ్రామాల్లో మహిళా సంఘాలకు సంబంధించిన విఒ భవనాల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, రైతుల సంక్షేమం, పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.