25 August, 2026 | 5:37 PM

ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

25-08-2026 04:47 PM

ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ విశ్వాసం కోల్పోతుంది

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి

సుల్తానాబాద్, ఆగస్టు 25 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర నాయకులు గుజ్జుల రామకృష్ణారెడ్డి  డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల జీవితంతో చెలగాటం ఆడవద్దని, వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు,  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు  చేపట్టిన 48 గంటల దీక్షకు మద్దతుగా సుల్తానాబాద్ లో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు ఆధ్వర్యంలో , మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు  కూకట్ల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పెద్ద ఎత్తున బిజెపి నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.

అలాగే సుల్తానాబాద్ పట్టణంలోని మరో ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సౌదరి మహేందర్ , ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మచ్చ విశ్వాస్ లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.15,000 కోట్ల ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం బిజెపి మండలాధ్యక్షుడు కందుల  శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఇందులో పెద్ద ఎత్తున బిజెపి నాయకులు, మహిళలు,  కార్యకర్తలు పాల్గొన్నారు.