సమతుల్య పౌష్టికాహారం అందించాలి
జిల్లా కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్ (విజయ క్రాంతి):జిల్లాలోని అంగన్వాడి కేంద్రాలకు వచ్చే పిల్లలకు సమతుల్యమైన పౌష్టిక ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత (Asifabad Collector K. Haritha) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ లో గల అంగన్వాడీ కేంద్రంలో చేపట్టిన తొలిముద్దు అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లా శాసనమండలి సభ్యులు దండే విఠల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డే అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, మున్సిపల్ చైర్ పర్సన్ మెంగ్రే ఆకాష్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే 3 - 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు సమతుల్య పౌష్టిక ఆహారం అందించి ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తల్లులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు తీసుకువచ్చి తొలిముద్ద అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలకు ఉప్మా, కిచిడీతో కూడిన అల్పాహారాన్ని అందించి తినిపించారు.
అనంతరం రైతు వేదికలో పోషణ మాసంలో భాగంగా ఏర్పాటు చేసిన గర్భిణులకు శ్రీమంతం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు, గర్భిణుల సంక్షేమం కొరకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వినియోగించుకోవాలని, అంగన్వాడీ కేంద్రంలో అందిస్తున్న పౌష్టిక ఆహారం సకాలంలో తీసుకోవాలని తెలిపారు. పరిశుభ్రత, ఆరోగ్య రక్షణ, ప్రారంభ విద్యపై మహిళలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం గర్భిణులకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వరూపారాణి, కౌన్సిలర్ కొండు భారతి, ఐ సి డి ఎస్ సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, గర్భిణులు, పిల్లలు పాల్గొన్నారు.