వినాయక నిమజ్జన ఏర్పాట్లలో అప్రమత్తంగా ఉండాలి
అదనపు కలెక్టర్ చంద్రయ్య
లక్షేట్టిపేట,సెప్టెంబర్ 22, (విజయక్రాంతి) : వినాయక నిమజ్జన ఏర్పాట్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య(District Additional Collector P. Chandraiah) అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రదేశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జన ప్రాంతాలలో భక్తులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని, విద్యుత్ దీపాలు, నిమజ్జనానికి అవసరమైన క్రేన్లు, పారిశుధ్య నిర్వహణ, బారికేడింగ్, రహదారుల శుభ్రత, త్రాగునీటి సౌకర్యం, వాహనాల రాకపోకల నిర్వహణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
నిమజ్జన సమయంలో విగ్రహాలను సురక్షితంగా నీటిలోకి తరలించేందుకు ఏర్పాటు చేసిన గజ ఈతగాళ్ల బృందాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితులలో తక్షణమే స్పందించేలా అవసరమైన సిబ్బంది, రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. రాత్రివేళలలో తగినంత వెలుతురు ఉండేలా లైటింగ్ ఏర్పాట్లను పూర్తి చేయాలని, క్రేన్లు పనిచేసే స్థితిలో ఉండేలా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని, ప్రజలు, భక్తులు నీటిలోకి వెళ్లకుండా అవసరమైన బారికేడ్లు, భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిమజ్జన ప్రక్రియ అనంతరం వ్యర్థాలు, పూజా సామగ్రి తదితరాలను వెంటనే తొలగించేలా పారిశుధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, నిమజ్జన పాయింట్ల వద్ద పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
నిమజ్జనానికి వచ్చే భక్తులు, వాహనాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, రాకపోకల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వినాయక నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా, సురక్షితంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య,తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమీషనర్ విజయ్ కుమార్,వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి, కౌన్సిలర్లు బిరుదుల సత్యనారాయణ, బోడ రాజేంద్ర ప్రసాద్, శనిగారపు చిన్నయ్య, పెండెం పద్మ రాజన్న, గోప సుజాత రమేష్ తదితరులు ఉన్నారు.