పేద కార్మికులు బలి!?
- రికార్డుల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు
- అధికారుల తప్పిదంతో ఇందిరమ్మ ఎల్ 3 జాబితాలోకి..
- పేదల సొంతింటి కల దూరం
ఇల్లెందు టౌన్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : పేదల సొంతింటి కలను సాకారం చేయాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో(Indiramma Housing Scheme) అధికారుల రికార్డు తప్పిదం ఇప్పుడు పేద కార్మిక కుటుంబాలకు(Working families) శాపంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగం(Government job) చేయని మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను(Municipal outsourcing workers) రికార్డుల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించడంతో వారి పేర్లు ఇందిరమ్మ ఇళ్ల L3 జాబితాలోకి వెళ్లాయి. దీంతో నిబంధనల ప్రకారం అర్హత ఉన్నప్పటికీ ఇల్లు పొందాల్సిన పేద కుటుంబాలు అన్యాయంగా వెనుకబడే పరిస్థితి ఏర్పడింది.
ఉద్యోగం అవుట్సోర్సింగ్.. రికార్డుల్లో ప్రభుత్వ ఉద్యోగం
ఇల్లందు మున్సిపాలిటీ వాటర్ సప్లై విభాగంలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులు ఏళ్లుగా పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా వంటి అత్యవసర సేవలు అందిస్తున్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగుల హోదా లేదు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి వేతనాలు, సౌకర్యాలు కూడా లేవు. అయినప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనలో మాత్రం వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఒకవైపు అవుట్సోర్సింగ్ కార్మికులుగా తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటున్న వారు. మరోవైపు అధికారిక రికార్డుల్లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు. ఈ వైరుధ్యమే ఇప్పుడు వారి సొంతింటి కలకు అడ్డంకిగా మారింది.
ప్రభుత్వ ఉద్యోగం లేదు. ప్రభుత్వ ఉద్యోగి హోదా లేదు. ప్రభుత్వ ఉద్యోగి వేతనం లేదు. అయినా రికార్డుల్లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగి
తప్పు అధికారులది.. నష్టం కార్మికులది
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు తమ వాస్తవ ఉద్యోగ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండగా రికార్డుల్లో నమోదైన తప్పు సమాచారంతో L3 జాబితాలోకి వెళ్లిపోయామని కార్మికులు చెబుతున్నారు. దీంతో అర్హత ఉన్నప్పటికీ తమకు ఇల్లు మంజూరయ్యే అవకాశం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే. రికార్డులో తప్పు చేసింది ఎవరు? ఆ తప్పుకు మూల్యం చెల్లిస్తున్నది ఎవరు?
అధికారుల స్థాయిలో జరిగిన రికార్డు తప్పిదానికి తమలాంటి పేద కార్మిక కుటుంబాలు నష్టపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు.
కలెక్టర్ వద్దకు వెళ్తే పీడీ.. పీడీ వద్దకు వెళ్తే కమిషనర్ సమస్యను సరిచేయించుకునేందుకు కార్మికులు ఇప్పటికే జిల్లా కలెక్టర్, పీడీ, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలను ఆశ్రయించారు. పలుమార్లు వినతిపత్రాలు అందించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీడీ కార్యాలయానికి వెళ్తే ఇది మున్సిపల్ కమిషనర్ పరిధిలోని అంశమని చెబుతున్నారు. మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి వెళ్తే పీడీ ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం కాకపోగా పేద కార్మికులు మాత్రం ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో.. పేద కార్మికుల కాళ్లు అరిగిపోతున్నాయి.
L3 నుంచి తొలగించి.. అర్హత ఉంటే L1లోకి తీసుకురావాలి
మున్సిపల్ ఉద్యోగ రికార్డులు, అవుట్సోర్సింగ్ నియామక వివరాలు, వేతన రికార్డులు, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను సమగ్రంగా పరిశీలిస్తే అసలు వాస్తవం స్పష్టమవుతుందని కార్మికులు చెబుతున్నారు. అవుట్సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించిన రికార్డు తప్పిదాన్ని వెంటనే సరిచేసి, నిబంధనల ప్రకారం అర్హత ఉన్న కార్మికుల పేర్లను L3 జాబితా నుంచి తొలగించి L1 కేటగిరీలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
పేదల సొంతింటి కలను రికార్డు తప్పిదం బలిచేయొద్దు
ఏళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు సొంత ఇల్లు ఇప్పటికీ కలగానే ఉంది. ప్రభుత్వం పేదలకు ఇళ్లు అందించేందుకు అమలు చేస్తున్న పథకంలో అధికారుల రికార్డు తప్పిదం కారణంగా అదే పేదలు నష్టపోయే పరిస్థితి రావడం విరుద్ధమైన పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రికార్డులను పరిశీలించి తప్పును సరిచేయాలని కార్మికులు కోరుతున్నారు. తప్పు చేసిన రికార్డును సరిచేయకుండా పేద కార్మికులను L3 జాబితాలోనే ఉంచితే.. అధికారుల తప్పిదానికి కార్మిక కుటుంబాల సొంతింటి కల బలైనట్లే అవుతుంది. సమస్యను తక్షణమే పరిష్కరించి అర్హులైన ప్రతి కార్మిక కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.