క్షేత్రస్థాయిలో వైద్యం హుళక్కే?
- కంగ్టి పీహెచ్‌సీలో వైద్య సేవలపై విమర్శలు
- డేటా, నివేదికలు ఉన్నా గ్రామాల్లో పర్యటన సున్నా
- ఇంటింటికీ వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి
కంగ్టి, సెప్టెంబర్ 29 : పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ ఆసుపత్రులే(Government hospitals) ప్రధాన ఆధారం. చిన్న అనారోగ్యం(Illness) వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రికి(Private hospital) వెళ్లే స్థోమత లేని కుటుంబాలు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపైనే(Government primary health centers) ఆధారపడుతుంటాయి. అలాంటి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలి. కానీ కంగ్టి మండలంలో అలాంటి కార్యక్రమం సరిగా నిర్వహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది తమ వద్దకు రావాలి, తమ సమస్యలను తెలుసుకోవాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.
అయితే కంగ్టి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో క్షేత్రస్థాయి వైద్య సేవల(Medical services)పై ప్రజల్లో పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో ఎంతమందికి షుగర్, బీపీ తదితర వ్యాధులు ఉన్నాయి..గ్రామాల్లో మహిళలు, కూలీలు, వృద్ధాప్యంతో బాధపడుతున్న వారు అనేకమంది ఉన్నారు. వారిలో ఎంతమందికి షుగర్, బీపీ, జ్వరం తదితర పరీక్షలు చేశారనే విషయాలను ఎప్పటికప్పుడు గుర్తించడం ప్రభుత్వ వైద్య సిబ్బంది బాధ్యత. గ్రామస్థాయిలో ఈ వివరాలు ప్రజలకు స్పష్టంగా తెలియడం లేదని కొందరు స్థానికులు అంటున్నారు. ఆరోగ్య శాఖ వద్ద నమోదయ్యే డేటాతో పాటు ప్రజల మధ్యకు వెళ్లి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడమే ముఖ్యమని వారు పేర్కొంటున్నారు.
ఇంటి వద్దకే వైద్యం రావాలని ఆకాంక్ష..
ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చి వైద్యం పొందే పరిస్థితిలో ఉండరు. ముఖ్యంగా వృద్ధులు, ఒంటరిగా జీవించే వారు, దూర ప్రాంత గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వారికి ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి పరీక్షలు నిర్వహిస్తే చిన్న సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. ఆసుపత్రి ఎక్కడ ఉందో ప్రజలకు తెలుసు కానీ ఆరోగ్య సిబ్బంది మా గ్రామానికి ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పరీక్షలు చేస్తారో కూడా తెలియాలి అని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.
ప్రజలకు ప్రయోజనం ఎప్పుడు?
ప్రస్తుతం వైద్య శాఖలో ఆన్లైన్ డేటా నమోదు, కంప్యూటర్ ఆధారిత నివేదికలు అవసరమే. అయితే కంప్యూటర్లో నమోదు చేసిన సమాచారం చివరకు ప్రజలకు మెరుగైన వైద్య సేవలుగా మారాలని స్థానికులు కోరుతున్నారు. షుగర్ ఉన్న వ్యక్తికి మందులు అందాయా..జ్వరంతో ఉన్న వ్యక్తిని పరీక్షించారా? బీపీ ఉన్నవారిని గుర్తించి పర్య వేక్షిస్తున్నారా? గర్భిణులు, వృద్ధులు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని సిబ్బంది ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారా అనే అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. ఇలావుండగా కంగ్టి పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేక ఆరోగ్య సర్వే నిర్వహించి గ్రామాల వారీగా ఆరోగ్య పరిస్థితిని గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆశా వర్కర్ల ద్వారా తెలుసుకుంటున్నాం
గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితిని ఆశా వర్కర్ల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రతి గ్రామంలో ఎవరికి ఎలాంటి జ్వరాలు ఉన్నాయి. ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారనే వివరా లను ఆశా వర్కర్లు సేకరించి తమ దృష్టికి తీసుకువస్తున్నారు. కొన్ని గ్రామాల్లో సబ్ సెంటర్లు కూడా ఉన్నాయి. అక్కడ పనిచేసే ఆరోగ్య సిబ్బంది సైతం ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దామరగిద్ద, సాదు తండాలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం.
డాక్టర్ నాగమణి, కంగ్టి, పీహెచ్సీ